ప్రతినాయకుడి పాత్ర, అందులో నటించే నటులను బట్టి హీరో పాత్ర, అందులో నటించే స్టార్ కూడా ఎలివేట్ అవుతాడనడంలో సందేహం లేదు. టాలీవుడ్లో బిగ్గెస్ట్ మాస్ హీరోల్లో ఒకడైన నందమూరి బాలకృష్ణకు అవతల ఒక పవర్ ఫుల్ విలన్ ఉంటే.. ఆ ఫేసాఫ్ ఎలా పండుతుందో చాలా సినిమాల్లో చూశాం. ‘లెజెండ్’ సినిమాలో బాలయ్యకు ఎదురుగా జగపతిబాబు ఉండడం వల్ల ఆ సినిమా లెవెల్ మారిపోయింది. ఆయన చివరి చిత్రాలు డాకు మహారాజ్, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డిల్లో కూడా బాలయ్యకు దీటుగా బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, దునియా విజయ్‌ల రూపంలో బలమైన విలన్లే కుదిరారు.
ఇప్పుడు వీరిని మించిన విలన్.. బాలయ్యను ఢీకొట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం ‘అఖండ-2’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ అంచనాలను ఇంకా పెంచేలా ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సంజయ్ దత్ ప్రతినాయక పాత్రలను అద్భుతంగా పండించగలడని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఆయన తరచుగా దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘కేజీఎఫ్-2’ సినిమాకు ఆయన విలనీ హైలైట్ అయింది. డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు సరిగా ఆడకపోయినా.. సంజు మాత్రం తన పాత్రలకు న్యాయం చేశాడు.ఆ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చాడు.
ఇప్పుడు ‘అఖండ-2’లో ఆయన విలన్ పాత్రకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అసలే బాలయ్యకు విలన్‌గా, పైగా అఖండ-2లో అంటే వీరి ఫేసాఫ్ మీద ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. ‘అఖండ’ తెలుగులో మాత్రమే రిలీజైనప్పటికీ.. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు దానిపై ఆసక్తి ప్రదర్శించారు. ఈ కథాంశం జాతీయ స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేదే. దీంతో ‘అఖండ-2’ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహా కుంభమేళాకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సంజయ్ కూడా యాడ్ అయినట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో రిలీజ్ టైంకి ‘అఖండ-2’పై హైప్ వేరే లెవెల్లో ఉంటుందనడంలో సందహం లేదు.