సూపర్ స్టార్ కృష్ణ గారు బ్రతికున్నన్ని రోజులు కలలు కన్న డ్రీం ప్రాజెక్ట్ ఛత్రపతి శివాజీ. ఈ మరాఠా యోధుడి వీరగాథను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని పలుమార్లు ప్రయత్నించారు. సింహాసనం బ్లాక్ బస్టరయ్యాక అనుకున్నారు కానీ సాధ్యపడలేదు. ఏవో కొన్ని అవాంతరాలు అడ్డు పడేవి. పైగా కమర్షియల్ గా ఏ మేరకు వర్కౌట్ అవుతుందోననే అనుమానాలు సన్నిహితుల నుంచి వ్యక్తమయ్యేవి. అప్పట్లో ప్యాన్ ఇండియాలు లేవు కాబట్టి. ఎన్టీఆర్ అంతటి లెజెండరీ నటుడే శివాజీ పాత్రను చేయలేకపోయారు. అందుకే నెంబర్ వన్, చంద్రహాస్ లాంటి సినిమాల్లో ఆ గెటప్ వేసి కృష్ణగారు సంతృప్తి పడ్డారు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే చావా దెబ్బకు మరాఠా వీరుల కథలకు ఎంత స్పాన్ ఉందో ఇండస్ట్రీకి అర్థమైపోయింది. అజయ్ దేవగన్ తానాజీతోనే ఇది రుజువైనప్పటికీ విక్కీ కౌశల్ దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. టయర్ 2 హీరోకే జనం అంతగా బ్రహ్మారథం పడుతున్నప్పుడు ఇమేజ్ ఉన్న స్టార్ చేస్తే ఇంకే స్థాయిలో ఆడుతుందో వేరే చెప్పాలా. అందుకే కృష్ణ గారి కోరికని మహేష్ బాబు తీర్చవచ్చు కదాని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇందులో తప్పేమి లేదు. ఎందుకంటే రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 తర్వాత మహేష్ మార్కెట్ భాష, దేశంతో సంబంధం లేకుండా అమాంతం పెరిగిపోవడం ఖాయం. సో ప్రయత్నిస్తే అద్భుతమే.
కాకపోతే దాన్ని సమర్ధవంతంగా హ్యాండిల్ చేసే దర్శకుడు దొరకాలి. గత రెండు మూడేళ్ళుగా శివాజీ సెంటిమెంట్ ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా పెరిగిపోయింది. ఇప్పుడు శంభాజీ మహారాజ్ కూడా ఆ లిస్టులో చేరిపోయారు. పలు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పటికే ఇతర యోధుల కథలను తవ్వి తీసే పనిని రచయితలకు అప్పజెప్పారని ముంబై న్యూస్. ఈ సబ్జెక్టుల్లో స్టామినా ఎంత ఉందో అర్థం చేసుకున్నారు కాబట్టే తొందపడుతున్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మహేష్ బాబు కనక ఛత్రపతి శివాజీగా ఒక పూర్తి నిడివి సినిమా చేస్తే మాత్రం అది ఊహించనంత పెద్ద చరిత్ర సృష్టించడం ఖాయం.