చావా వసూళ్లలోనే కాదు ఇతరత్రా విషయాల్లోనూ సంచలనాలు నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రేక్షకులు క్లైమాక్స్ అయ్యాక విపరీత భావోద్వేగాలకు గురై సీట్ల దగ్గర నిలబడి జై శంభాజీ నినాదాలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కొందరు ఏకంగా గుర్రాలు ఎక్కి థియేటర్లకు వస్తున్నారు. శివాజీ వేషధారణతో ఆకట్టుకుంటున్న ఆడియన్స్ కనిపిస్తున్నారు. ఇవన్నీ పాజిటివ్ గా చెప్పుకోవడానికి ఉదాహరణగా పనికొచ్చేవి. దీనికి ఇంకో కోణం ఉంది. అదేంటో చూస్తే సినిమా ప్రభావం జనాల మీద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
గుజరాత్ రాష్ట్రంలోని భరుచ్ నగరంలో ఉన్న ఆర్కె సినిమాస్ మల్టీప్లెక్స్ లో నిన్న రాత్రి చావా సెకండ్ షోకు జయేష్ వాసవ అనే వ్యక్తి వచ్చాడు. బాగా తాగి ఉన్నప్పటికీ ఆ వాసన తెలియనివ్వకుండా సిబ్బందిని మేనేజ్ చేసి లోపలికి వెళ్ళాడు. రాత్రి 11 గంటల 45 నిముషాల సమయంలో హఠాత్తుగా స్క్రీన్ మీద విరుచుకుపడి నిప్పును ఆర్పే ఎక్స్ టింగిషర్ తో చింపేయడం మొదలుపెట్టాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే శంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టడం తట్టుకోలేక ఆ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాని చంపాలనే ఉద్దేశంతో దీనికి తెగబడ్డాడట. ఇది జరిగినంత సేపూ హాల్లో తీవ్ర కలకలం రేగింది.
ఇతను చేసిన ఘనకార్యం వల్ల థియేటర్ కు సుమారు రెండు లక్షల దాకా నష్టం వాటిల్లింది. మరుసటి రోజు కొన్ని షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. వాటిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులకు రీ ఫండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి జయేష్ వాసవని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అతను ఎంత ఎమోషన్ లో చేసినప్పటికీ రెండు వందల రూపాయల టికెట్ పెట్టి చేసిన నష్టం లక్షలకు చేరుకుంది. ఉదంతం సంగతి పక్కనపెడితే చావా ఏ స్థాయిలో జనాలకు ఎక్కిందో క్లారిటి వచ్చేసిందిగా. ముఖ్యంగా మహారాష్ట్రలో జాతరకు వెళ్లినట్టు పబ్లిక్ తండోపతండాలుగా కౌంటర్ల దగ్గర క్యూ కడుతున్నారు.