నెటిజన్లకు దొరికిపోయిన జక్కన్న

ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ రోజే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొమరం భీమ్ టీజర్ రిలీజ్ చేశాడు రాజమౌళి. ఈ టీజర్ విషయంలో మిశ్రమ స్పందన వచ్చింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై వావ్ అనిపించిన సీతారామరాజు టీజర్‌తో పోలిస్తే.. భీమ్ టీజర్ అంత ఎగ్జైటింగ్‌గా లేదనే అభిప్రాయం వినిపించింది. ఆ సంగతలా ఉంచితే.. ఈ టీజర్లో చూపించిన విజువల్స్ ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. కొన్ని షాట్లు ఎక్కడి నుంచో లేపుకొచ్చినవి అనే విషయాన్ని కొన్ని గంటల్లోనే నెటిజన్లు కనిపెట్టేశారు.

కొమరం భీమ్ ఓ గిరిజన తెగకు చెందిన వాడన్న సంగతి తెలిసిందే. ఆయన జీవితంలో ఎక్కువ భాగం అటవీ ప్రాంత నేపథ్యంలోనే సాగింది. టీజర్లో ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ అడవులకు సంబంధించిన విజువల్సే తీసుకున్నారు. ఐతే టీజర్లో ఒక చోట చూపించిన దట్టమైన అడవి మధ్యలో సూర్య బింబం విజువల్.. అలాగే వర్షంలో నీటి బిందువుల విజువల్.. ఇంకా అగ్నిపర్వతాన్ని చూపించిన దృశ్యం.. ఇవన్నీ కూడా రాజమౌళి టీం షూట్ చేసినవి కావు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌కు చెందిన ఒక వీడియో నుంచి అగ్నిపర్వతం విజువల్ తీసుకోగా.. ఇంకో రెండు చోట్ల నుంచి అడవి, నీటి బిందువల దృశ్యాలు తీసుకున్నారు.

మనం ఇంటర్నెట్ అనే మహా సముద్రం నుంచి తీసుకున్నాం కదా.. దీన్నెవరు కనిపెడతారులే అని ఫిలిం మేకర్స్ అనుకుంటారు కానీ.. నెటిజన్లను తక్కువగా అంచనా వేస్తే కష్టమని గతంలో చాలాసార్లు రుజువైంది. ఇటీవలే ‘రాధేశ్యామ్’కు సంబంధించిన ఒక పోస్టర్లో చూపించిన వింటేజ్ ట్రైన్ దృశ్యం కూడా కాపీ అని దానికెంతగా మేకప్ చేసినా సరే.. నెటిజన్లు కనిపెట్టేశారు.

ఇక భీమ్ టీజర్ విషయానికి వస్తే.. కరోనా టైంలో విజువల్స్ తీయడానికి జక్కన్నకు టైం లేకపోయింది. ఈ నెల ఆరంభంలోనే షూటింగ్ పున:ప్రారంభం కాగా.. తారక్ మీద కొన్ని దృశ్యాలు చిత్రీకరించాడు. వాటికి పై విజువల్స్ జోడించి టీజర్ వదిలేశాడు. కానీ ఇంటర్నెట్ జనాల పుణ్యమా అని ఇలా దొరికిపోయాడు. కరోనా టైం కాబట్టి ఈ విషయంలో రాజమౌళిని మన్నించేయొచ్చని నెటిజన్లు అర్థం చేసుకోవాలి.