ఒక్క సినిమాతో లెవెలే మారిపోయింది

గత శుక్రవారం మంచి అంచనాల మధ్య విడుదలైన హిందీ సినిమా.. చావా. లెజెండరీ కింగ్ ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా ప్రోమోలన్నీ బాగున్నప్పటికీ.. విక్కీ మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టి తీసిన భారీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం వర్కవుట్ అవుతుందో అన్న సందేహాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అందులోనూ అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో ‘చావా’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో థియేటర్లకు రప్పించగలగా అన్న అనుమానాలూ కలిగాయి. కానీ ‘చావా’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. తొలి వారాంతంలో వంద కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.

బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు కూడా ఓపెనింగ్స్ పడిపోతుండగా.. విక్కీ చిత్రానికి తొలి వీకెండ్లో ఏ రోజూ 30 కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమాలో కంటెంట్‌కు తోడు.. విక్కీ స్టార్ పవర్ ఈ సినిమాకు బాగానే కలిసొస్తోంది.గత కొన్నేళ్ల నుంచి మంచి మంచి సినిమాలు, అదిరిపోయే పెర్ఫామెన్సులతో విక్కీ ప్రేక్షకాదరణ పెంచుకుంటూ వస్తున్నాడు. ‘సర్దార్ ఉద్దమ్ సింగ్’, ‘శ్యామ్ బహద్దూర్’ లాంటి చిత్రాల్లో విక్కీ నటనకు హిందీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ‘చావా’లో శంబాజీ మహారాజ్ పాత్రలో తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి.

‘చావా’ థియేటర్లలో ప్రేక్షకుల భావోద్వేగాలు, స్టాండింగ్ ఒవేషన్లు చూస్తుంటే ఈ సినిమా, విక్కీ పెర్ఫామెన్స్ వారిని ఎంతగా కదిలిస్తున్నాయో అర్థమవుతుంది. విక్కీ పెర్ఫామెన్స్‌కు సంబంధించి కొన్ని వీడియో క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించినప్పటికీ.. శంబాజీ పాత్రలో వీరత్వాన్ని, రౌద్ర రసాన్ని, భావోద్వేగాలను విక్కీ పండించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ఇప్పటికే స్టార్ స్టేటస్ సంపాదించిన విక్కీ.. ఈ చిత్రంతో సూపర్ స్టార్లకు దగ్గరగా వెళ్లిపోయేలా ఉన్నాడు. తన మార్కెట్‌ను ఎంతగానో విస్తరించేలా కనిపిస్తోంది ‘చావా’. విక్కీ తర్వాతి చిత్రాలకు బిజినెస్ అమాంతం పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.