టాలీవుడ్లో ఒకప్పుడు పూరి జగన్నాథ్ ఎలాంటి వైభవం చూశాడో అందరికీ తెలిసిందే. ‘పోకిరి’ సహా తిరుగులేని విజయాలతో ఒకప్పుడు ఆయన ఒక వెలుగు వెలిగాడు. ఎందరో హీరోలను స్టార్లను చేసిన ఘనత ఆయన సొంతం. కానీ ఎంత గొప్ప దర్శకుడైనా ఒక దశ దాటాక ఔట్ డేట్ అయిపోవడం, వరుస ఫెయిల్యూర్లు ఎదుర్కొని ఇబ్బంది పడడం మామూలే. అందుకు పూరి కూడా మినహాయింపు కాలేకపోయాడు.
గత దశాబ్ద కాలంలో ‘ఇస్మార్ట్ శంకర్’ మినహా పూరికి సక్సెస్ లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా ఫ్లూక్ హిట్ అనే అభిప్రాయాన్ని బలపరుస్తూ.. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. దీంతో పూరి కొత్త సినిమా పట్టాలెక్కడంలో ఇబ్బందులు తప్పట్లేదు. తెలుగులో పూరికి డేట్లు ఇచ్చే స్టార్ హీరో కనిపించడం లేదు. నిర్మాతలు దొరకడమూ కష్టంగానే కనిపిస్తోంది.
ఇలాంటి టైంలో పూరి గురి ఓ బాలీవుడ్ టాప్ స్టార్ మీద పడడం ఆసక్తి రేకెత్తించే విషయం. గత కొన్ని నెలలుగా పూరి కొత్త రైటర్లను పెట్టుకుని ఒక భారీ యాక్షన్ కథను రెడీ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఆయన ముంబయికి వెళ్లి ఆ స్టోరీ నరేషన్ కూడా పూర్తి చేశారని తెలిసింది. అతను నరేషన్ ఇచ్చింది ‘యానిమల్’తో సూపర్ స్టార్‌గా ఎదిగిన రణబీర్ కపూర్‌కు కావడం విశేషం.
కథ విని రణబీర్ కూడా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. కానీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. కొంచెం టైం అడిగాడట. మరి నిజంగా రణబీర్ కపూర్ కనుక ఈ సినిమాను ఓకే చేసి, దీన్ని పూరి పట్టాలెక్కించగలిగితే అదొక సెన్సేషన్ కావడం ఖాయం. కెరీర్లో ఈ దశలో రణబీర్‌తో పూరి సినిమా ఓకే చేయించగలిగితే గొప్ప విషయమే.
పూరి ఈసారి బాలీవుడ్లోనే సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నాడట. వేరే హీరోలు, నిర్మాతలను కూడా కలుస్తున్నాడట. త్వరలోనే ఏదో ఒక ప్రాజెక్టు ఓకే అవుతుందనే ఆశాభావంతో ఆయన టీం ఉంది. తమిళ యువ కథానాయకుడు శివకార్తికేయన్ సైతం పూరితో పని చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు సమాచారం.