‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది ముంబయి భామ శ్వేత బసు ప్రసాద్. బాలనటిగా బాలీవుడ్ క్లాసిక్ ‘ఇక్బాల్’లో నటించిన ఆమె హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది ‘కొత్త బంగారు లోకం’తోనే. ఈ సినిమాలో ‘ఎకాడా..’ అంటూ ఆమె చెప్పిన డైలాగులకు యూత్ ఫిదా అయిపోయారు. చిన్న వయసులోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించిందామె.
కానీ ఈ సినిమా తర్వాత శ్వేతకు వరుసగా అవకాశాలు వచ్చినా.. అవి పెద్దగా ఉపయోగపడలేదు. ‘రైడ్’ మినహా తెలుగులో తర్వాత నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్లు కావడం.. మధ్యలో ఓ కాంట్రవర్శీ ఆమెను చుట్టుముట్టడంతో టాలీవుడ్‌ను ఖాళీ చేసి ముంబయికి వెళ్లిపోయింది. అక్కడే హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది.
ఐతే తెలుగులో నటించి బాలీవుడ్‌కు వెళ్లిపోయాక ఇక్కడి సినిమాలు, ఇండస్ట్రీ గురించి విమర్శలు చేయడం చాలామంది హీరోయిన్లకు అలవాటే. శ్వేత కూడా ఇప్పుడు అదే చేసింది.
ఒక తెలుగు సినిమా సెట్‌లో తనను హీరో సహా అందరూ ఎగతాళి చేసినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది శ్వేత. ‘‘కెరీర్ పరంగా ఇబ్బందిపడ్డ సందర్బాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఒక తెలుగు సినిమా సెట్లో చాలా అసౌకర్యానికి గురయ్యా. హీరోతో పోలిస్తే నేను ఎత్తు తక్కువ ఉన్నానని ప్రతి ఒక్కరూ ఎగతాళి చేశారు. హీరో ఆరడుగులుంటే నేను ఐదడుగులే ఉన్నానని అనేవారు. ఇక ఆ హీరో వల్ల కూడా చాలా ఇబ్బంది అయింది.
అతను ప్రతి సీన్ మార్చేస్తూ ఉండేవాడు. నాకు తెలుగు రాకపోయినా కష్టపడి డైలాగ్స్ చెప్పేదాన్ని. కానీ అతను తెలుగువాడే అయినా తన మాతృభాషలో డైలాగులు సరిగా చెప్పలేకపోయేవాడు. పైగా నా కంట్రోల్‌లో లేని నా హైట్ గురించి కామెంట్ చేసేవాడు. ఎత్తు అనేది వారసత్వంగా వస్తుంది. అందుకు నేనేం చేయగలను? నాకు తెలిసి నేను చాలా బాధ పడ్డ సినిమా సెట్ అంటే అదే’’ అని శ్వేత బసు చెప్పింది.
శ్వేత చివరగా తెలుగులో 2018లో వచ్చిన ‘విజేత’లో నటించింది. అందులో చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించాడు.