తెలుగు ఫ్యామిలీ సినిమాలు VS యూత్ డబ్బింగ్ బొమ్మలు

ఈ శుక్రవారం ఫిబ్రవరి 21 బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. స్టార్ కాదు కదా కనీసం మిడ్ రేంజ్ నుంచి కూడా ఏ హీరో రావడం లేదు. కానీ క్లాష్ అయితే వెరైటీగా ఉంది. ముందు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల సంగతి చూస్తే మొదటిది ‘రామం రాఘవం’. కమెడియన్ ధనరాజ్ దర్శకుడిగా మారి తండ్రి కొడుకుల కథకు భావోద్వేగాలను మేళవించి మంచి సందేశం ఇచ్చినట్టు ప్రమోట్ చేసుకుంటున్నారు.

కన్నీళ్లతో మీ గుండెలను తాకడం ఖాయమని హామీ ఇస్తున్నారు. ఇలాంటి ఫాదర్ ఎమోషన్ మీద వస్తున్న మరో చిత్రం ‘బాపు’. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించగా బలగం తరహాలో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు.

ఇక డబ్బింగ్ బొమ్మల సంగతి చూస్తే ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ పక్కా యూత్ అంశాలతో వాళ్లనే టార్గెట్ చేసుకుంటోంది. ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చేశారు. గత ఏడాది సంచలన విజయం సాధించిన ప్రేమలు తరహాలో ఇది కూడా సర్ప్రైజ్ హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ మార్కెటింగ్ చేస్తోంది.

లవ్ టుడేతో డెబ్యూ సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ఈసారి ‘రిటర్న్ అఫ్ ది డ్రాగన్’గా వస్తున్నాడు. ఇది కూడా యూత్ ఫుల్ కంటెంటే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించడం మరో ఆకర్షణ. మైత్రి సంస్థ పంపిణి కావడంతో థియేట్రికల్ రిలీజ్ పెద్దగానే దక్కనుంది.

ఈ నాలుగు సినిమాలకు సానుకూల అంశం ఏంటంటే తండేల్ నెమ్మదించాక బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చిన సినిమా రాలేదు. లైలా దారుణంగా నిరాశ పరచగా బ్రహ్మ ఆనందంకు ప్రశంసలు వచ్చాయి కానీ డబ్బులు తెచ్చే సూచనలు పెద్దగా కనిపించడం లేదు. డీసెంట్ అనిపించుకుంటోంది తప్ప అద్భుతాలకు నో ఛాన్స్.

సో టాక్ కనక బాగా తెచ్చుకుంటే ఫిబ్రవరి 21 మంచి ఓపెనింగ్స్ తో మొదలుపెట్టొచ్చు. ఆపై వారం సందీప్ కిషన్ మజాకా ఒకటే ఉంటుంది కాబట్టి మంచి రన్ మీద ఆశలు పెట్టుకోవచ్చు. పిల్లల పరీక్షల సీజన్ వచ్చేయడం థియేటర్ వాతావరణం మీద ప్రభావం చూపిస్తోంది.