మాలీవుడ్ షట్ డౌన్… రెమ్యునరేషన్లు తగ్గనున్నాయా?

ఇప్పుడు అన్ని ఫిలిం ఇండస్ట్రీలను వేధిస్తున్న సమస్య.. అధిక బడ్జెట్. కొవిడ్ తర్వాత బడ్జెట్లు అసాధారణంగా పెరిగిపోయాయి. డిజిటల్ మార్కెట్ చూసుకుని హీరోలందరూ పారితోషకాలు పెంచేశారు. తీరా చూస్తే ఆ మార్కెట్ పెరిగిపోయింది. బడ్జెట్లేమో చాలా పెరిగిపోయాయి. సినిమాలకు తగినంత బిజినెస్ జరగట్లేదు. దీంతో నిర్మాతల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది.

స్టార్ హీరోలను పారితోషకాలు తగ్గించుకోమని చెప్పే పరిస్థితి లేదు. వాళ్లకున్న డిమాండ్ దృష్ట్యా నిర్మాతలే ఎక్కువ పారితోషకాలు ఆఫర్ చేసి, కమిట్మెంట్లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్య రోజు రోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ఈ పరిస్థితుల్లో మలయాళ నిర్మాతలు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. పారితోషకాలు తగ్గే వరకు ఇండస్ట్రీని షట్ డౌన్ చేయాలని అక్కడి నిర్మాత తీర్మానం చేశారు.

జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మలయాళ నిర్మాతలు ఇవ్వదగ్గ పారితోషకంతో పోలిస్తే హీరోలు 10 రెట్లు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని అక్కడి నిర్మాతలు అంటున్నారు. ఐతే పారితోషకాల సమస్యనే తీసుకుంటే.. టాలీవుడ్ గురించి ముందు మాట్లాడుకోవాలి. ముందు నుంచే ఇక్కడి స్టార్ హీరోల పారితోషకాలు ఎక్కువ.

వాళ్ల ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కూడా ఎక్కువే అన్నది వాస్తవం. కానీ కొవిడ్ టైంలో అసాధారణంగా రేట్లు పెంచేశారు హీరోలు. డిజిటల్ డీల్స్ రూపంలో కొత్త ఆదాయ మార్గం రావడం.. వాటితోనే బడ్జెట్ రికవర్ అయిపోవడం చూసి హీరోలంతా పారితోషకాలు పెంచేశారు. కొందరు డిజిటల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్నే రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారు.

కానీ గత రెండేళ్లలో డిజిటల్ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ముందు ఓటీటీల పుణ్యమా అని శాటిలైట్ మార్కెట్ దెబ్బ తింది. ఇప్పుడేమో ఇదీ పడిపోవడంతో నిర్మాతల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. తెలుగులో సినిమాల నిర్మాణం పూర్తిగా జూదంగా మారిపోయిందని.. సక్సెస్ రేట్ రోజు రోజుకూ పడిపోతోందని నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో మలయాళ సినీ పరిశ్రమలో సమ్మె విజయవంతం అయి.. హీరోలు పారితోషకాలు తగ్గించడం మొదలైతే.. టాలీవుడ్లో కూడా దీని గురించి చర్చ జరిగి నిర్మాతలు ఏదో ఒక కార్యాచరణకు నడుం బిగించే పరిస్థితులు వస్తాయేమో చూడాలి.