నోరు మంచిదైతే ఊరు మంచిదనే పాత నానుడి ఒకటుంది. దీనికి కాలంతో సంబంధం లేదు. ఎప్పుడైనా వర్తిస్తుంది. ఒకప్పుడు టెక్నాలజీ లేని కాలంలో ఎవరైనా మాట జారినా దానికంత ప్రాముఖ్యం ఉండేది కాదు. ఏదైనా పేపర్ లోనో టీవీలో వస్తే తప్ప జనాలకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడలా లేదు.
ఫైవ్ జి లైవ్ ప్రపంచంలో ప్రతిదీ ప్రత్యక్ష ప్రసారంలో పబ్లిక్ కళ్ళలోకి నేరుగా వెళ్ళిపోతోంది. ఇటీవలే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ పృథ్వి చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఏపీ అపోజిషన్ ని ఉద్దేశించి వ్యంగ్యంగా కామెడీ చేశారంటూ సదరు పార్టీ కార్యకర్తల బృందం బాయ్ కాక్ లైలాని ట్రెండ్ చేసింది.
దీని ప్రభావం ఓపెనింగ్స్ మీద ఎంతమేరకు పడిందనేది పక్కనపెడితే లైలా స్వతహాగా బాగా లేకపోవడం వల్ల ఫ్లాప్ అయ్యిందనేది వాస్తవం. ఒకవేళ సినిమా బాగుండి అప్పుడు నెగటివ్ ట్రెండ్ బారిన పడి ఉంటే నిర్మాత చాలా నష్టపోవాల్సి వచ్చేది. ఇది గుర్తించిన ఇతర ప్రొడ్యూసర్లు ఇకపై పృథ్వికు అవకాశాలు ఇవ్వకూడదని అనధికారికంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఏం మాట్లాడతాడో ముందే తెలియక టెన్షన్ పడే కంటే, అసలు తీసుకోకపోతే ఇంకా ఉత్తమమనే అభిప్రాయంలో పలువురు ఉన్నట్టు వినికిడి. ఎలాగూ ప్రత్యేకంగా ఆయన వల్ల వేల్యూ యాడ్ అయిన సినిమాలు గత కొన్నేళ్లలో ఏవీ లేవు.
గతంలో ఇదే తరహాలో పోసాని కృష్ణమురళి, కృష్ణ భగవాన్ లాంటి వాళ్ళు సామజిక, రాజకీయ వ్యవహారాలను సినిమాలకు ముడిపెట్టి లేనిపోని వివాదాలతో కెరీర్ మసకబారేలా చేసుకున్నారు. ఇప్పుడు పృథ్వి కూడా మినహాయింపుగా నిలిచేలా లేదు.
ఎలాగూ జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఛాన్సులు వచ్చినా రాకపోయినా పెద్దగా పోయేదేముందని అనుకోవచ్చు. కాకపోతే ఈ వ్యవహారం వల్ల విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి మీడియా కెమెరాల ముందు సారీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది వాళ్లకు ఇబ్బంది కలిగించింది. లైలా రిలీజ్ కు ముందు పృథ్వి క్షమాపణ అయితే చెప్పారు కానీ దాని వల్ల ఒరిగింది కూడా ఏమి లేదు.