లెక్క తప్పుతున్న మాస్ కా దాస్

లైలా విడుదల ముందు వరకు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరగడం కళ్లారా చూశాం. నటుడు పృథ్వి చేసిన కామెంట్లు ఒక రాజకీయ పార్టీని రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఆ కార్యకర్తలు ఇచ్చిన బాయ్ కాట్ నినాదం చాలా దూరం వెళ్ళింది. ఆఖరికి విశ్వక్ సేన్ తన తప్పు లేకపోయినా సారీ చెప్పి సినిమా చూడమని కోరుకున్నాడు.

కట్ చేస్తే నిన్న లైలా రిలీజైపోయింది. మార్నింగ్ షో నుంచే విపరీతమైన నెగటివ్ టాక్ వచ్చేసింది. గత కొన్నేళ్లలో ఏ చెప్పుకోదగ్గ హీరోకు రానంత వీక్ రేటింగ్స్ దీనికే పడ్డాయి. కొందరు వీడియో రివ్యూయర్లు మాటల్లో చెప్పలేనంత దారుణంగా లైలా మీద విరుచుకుపడితే నిమిషాల్లో వైరలయ్యాయి.

ఇప్పుడు విశ్వక్ సేన్ కు తత్వం బోధపడి ఉండాలి. యాటిట్యూడ్, సింపతీ, కాంట్రావర్సి ఇవన్నీ ప్రతిసారి పని చేసే మంత్రాలు కావు. గతంలో నన్ను తొక్కేస్తున్నారంటే జనం అయ్యో అనుకున్నారు. తర్వాత కొత్త రిలీజులు జరిగినప్పుడల్లా ఇంటర్వ్యూలలో ఏదో ఒక వివాదం అనిపించే పాయింట్ తేవడం లేదా రెచ్చగొట్టే తరహా ధోరణిని ప్రదర్శించడం విశ్వక్ తనకు తెలియకుండానే చూపించాడేమో చెప్పలేం కానీ లైలా మాత్రం గొప్ప గుణపాఠం కాబోతోంది.

నిజానికి నిన్న బాయ్ కాట్ బ్యాచ్ వల్ల లైలాకు జరిగిన డ్యామేజ్ ఏం లేదు. సినిమా చూసిన వాళ్లే నిర్మొహమాటంగా విశ్వక్ టేస్ట్ ని ఏకిపారేస్తున్నారు.

ఇకనైనా కంటెంట్ మీద దృష్టి పెట్టడం విశ్వక్ కు చాలా అవసరం. క్వాలిటీ ఉంటే చిన్నాపెద్దా తేడా లేకుండా ఎవరినైనా ఆదరించే మనసు తెలుగు ప్రేక్షకులది. సుహాస్, ప్రియదర్శి లాంటి వాళ్ళు సోలో హీరోలుగా అవకాశాలు దక్కించుకుంటున్నారంటే కారణం నాణ్యతకిచ్చే ప్రాధాన్యం వల్లేగా. వాళ్లకూ డిజాస్టర్లు పడుతున్నాయి.

కానీ జనంలో వీళ్ళు హిట్టు కొడితే బాగుండనే సానుభూతి ఉంది. విశ్వక్ అది సంపాదించుకోగలిగిననాడు లైలా కంటే పెద్ద ఫ్లాపులు వచ్చినా ఏం కాదు. అయినా బూతులు, అడల్ట్ కామెడీతో యూత్ ని ఆకట్టుకోవచ్చనే అర్థం లేని ఆలోచనలు మానేయడం విశ్వక్ సేన్ ముందున్న తక్షణ కర్తవ్యం.