బాలీవుడ్ ఎదురు చూసిన బిగ్గెస్ట్ మూవీ అఫ్ ది ఇయర్ చావా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. విక్కీ కౌశల్ కెరీర్ లో అత్యంత భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా ముప్పై అయిదు కోట్ల దాకా ఫస్ట్ డే గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ వారం నెంబర్ వన్ పొజిషన్ లో ఉండటం ట్రేడ్ ని సంతోషంలో ముంచెత్తుతోంది.
గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో ద్వారా ఆరు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్ కావడంతో మన ప్రేక్షకుల్లోనూ దీని మీద ఆసక్తి లేకపోలేదు. ఇంతకీ బిల్డప్ ఇచ్చినంత గొప్పగా చావా ఉందో లేదో సింపుల్ లుక్ వేద్దాం.
ఛత్రపతి శివాజీ నిర్యాణం చెందాక ఆయన వారసుడిగా ధరమ్ వీర్ శంభాజీ (విక్కీ కౌశల్) మరాఠా సామ్రాజ్య పరిరక్షణ బాధ్యతలు తీసుకుంటాడు. అయితే ఎప్పటి నుంచో దీని మీద కన్నేసిన ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని రకరకాల కుట్రలు పన్నుతాడు.
ఆఖరికి స్వంత మనుషులు చేసిన ద్రోహం వల్ల ఔరంగజేబుకి శంభాజీ దొరుకుతాడు. రాజ్యాలు ఇచ్చేసి మతం మారితే వదిలేస్తానని ఔరంగజేబు పెట్టిన నిబంధనని తిరస్కరించిన శంభాజీ రోజుల తరబడి చిత్రహింసలు అనుభవించి వీరోచితంగా సంకెళ్ళ మధ్యే కన్ను మూస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే రెండు గంటల నలభై నిమిషాల చావా కథ ఇదే.
దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ చరిత్రను విశదీకరించి చెప్పడం కన్నా శంభాజీ మనో నిబ్బరం, సాహసం ఎంత గొప్పదో చెప్పేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో మలుపులు, డ్రామాని యుద్ధ సన్నివేశాలు డామినేట్ చేశాయి. అవసరానికి మించి శంభాజీ కుటుంబం, మంత్రి వర్గంలో జరిగే నాటకీయతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ఫస్ట్ హాఫ్ అధిక శాతం ల్యాగ్ అయిపోయింది.
అసలు కథని ఎక్కువ చెప్పకుండా ఫైట్లు, ఎలివేషన్లతో నింపేయడం చావాకు మైనస్ అయ్యింది. మొఘల్ సైన్యం మీద వివిధ మార్గాల్లో మరాఠా వీరులు దండయాత్ర చేసే ఎపిసోడ్లు కొంచెం రిపీట్ అయిన ఫీలింగ్ కలిగిస్తాయి.
చివరి నలభై నిముషాలు శంభాజీ గుండె ధైర్యాన్ని ఆవిష్కరించడంలో లక్ష్మణ్ ఉతేకర్ విజయం సాధించాడు. సినిమా మొత్తం మీద ఆయువు పట్టు అనిపించే ఎపిసోడ్ ఇదే. రష్మిక మందన్న పాత్రని చాలా పరిమితం చేశారు. ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల గొప్పగా అనిపించగా, కొన్ని సందర్భాల్లో తేలిపోయింది.
పాటలు సోసోనే. కీలకమైన చాలా పాత్రలను పైపై చూపించి మమ అనిపించారు. అశుతోష్ రానా, ప్రదీప్ రావత్ క్యారెక్టర్లు ఉదాహరణగా చెప్పొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే సైరా తరహాలో మిశ్రమ ఫీలింగ్ కలిగించినా ఉత్తరాది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడానికి చావాకు ఛాన్స్ ఎక్కువ.