తమన్ మీద ప్రేమ… బాలయ్య ఖరీదైన కానుక

ఒక సంగీత దర్శకుడితో బలమైన బాండింగ్ ఏర్పడితే బాలకృష్ణ అంత సులభంగా వాళ్ళను వదులుకోవడానికి ఇష్టపడరు. గతంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ వరసగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చినప్పుడు ఈ కాంబో మీద ఆడియో మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. కొన్ని సంవత్సరాల పాటు ఈ కలయిక రిపీటవుతూనే వచ్చింది.

మళ్ళీ అంతగా బాలయ్య నమ్మిందంటే తమన్ నే. ఎంతగా అంటే పబ్లిక్ స్టేజి మీద తనకు నందమూరి తమన్ అని ఇంటి పేరు మార్చి ప్రేమగా పిలుచుకునేంతగా. అఖండతో ఈ కాంబినేషన్ మొదలయ్యింది. కంటెంట్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతంగా ఎలివేట్ చేసిన ఘనత తమన్ కు దక్కుతుంది.

ఆ తర్వాత వీరసింహారెడ్డిలో బిజిఎం ఇప్పటికీ ఫ్యాన్స్ ఫేవరెట్. ఇప్పటికీ సోషల్ మీడియా ఎలివేషన్ వీడియోలకు దీన్నే వాడుతూ ఉంటారు. భగవంత్ కేసరి గురించి తెలిసిందే. ఇతర భాషల్లోనూ గొప్ప ఆదరణ దక్కించుకుంది. ఇక ఇటీవలే వచ్చిన డాకు మహారాజ్ స్కోర్ వేరే లెవెల్.

బాలయ్య పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మ్యాచ్ చేసేలా తమన్ ఇచ్చిన నేపధ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. సీన్లలో ఉన్నహెచ్చుతగ్గులను కవర్ చేసిన విధానం గొప్పగా వచ్చింది. ఇప్పుడు అఖండ 2 తాండవం కోసం తమన్ ఇస్తున్న క్రేజీ అప్డేట్స్ అభిమానుల అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి.

ఇంత ప్రేమనిచ్చిన తమన్ కు బాలయ్య ఖరీదైన కానుక ఇచ్చారు. పోర్షే కారుని బహుకరించారు. మార్కెట్ లో దీని బేస్ మోడల్ కోటిన్నర దాకా ఉండగా ప్రీమియంది రెండు కోట్ల వరకు ఉంది. గరిష్టంగా గంటకు 284 కిలీమీటర్ల వేగంతో దీంట్లో దూసుకుపోవచ్చు. మొత్తం ఆటోమేటిక్ సిస్టం ఉంటుంది.

పోర్షేలో cayanne మోడల్ గా దీనికి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. బాలయ్య బయటికి తెలియకుండా ఎన్నో సహాయాలు, కానుకలు ఎందరికో ఇస్తుంటారు కానీ ఇలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఇంత కాస్ట్లీ కార్ ఇవ్వడం చాలా అరుదు. ఏమైనా తమన్ అదృష్టవంతుడు. ఇంత ప్రేమను బాలకృష్ణ నుంచి అందుకున్నందుకు.