విశ్వంభర వ్యవహారం ఎప్పుడు తేలుతుంది

ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత మళ్ళీ అంత పెద్ద ఫాంటసీ బ్లాక్ బస్టర్ చిరంజీవికి పడలేదు. మధ్యలో అంజి వచ్చింది కానీ అంచనాలు అందుకోవడంలో తడబడి ఫ్లాప్ గా నిలిచింది. అందుకే విశ్వంభర మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

దర్శకుడు వశిష్ట వింటేజ్ మెగాస్టార్ ని గూస్ బంప్స్ వచ్చేలా చూపిస్తానని పలు ఇంటర్వ్యూలలో ఊరించడం అభిమానుల అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. అయితే ఇప్పటిదాకా విడుదల తేదీ వ్యవహారం కొలిక్కి రాలేదు. గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతి వదులుకోవడం ఉత్త మాటేనని తర్వాత అర్థమైపోయింది.

నిన్నటి దాకా జరిగిన ప్రచారం విశ్వంభర మే 9 రిలీజ్ కావొచ్చని. గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డేట్ కాబట్టి ఆ సెంటిమెంట్ పనికొస్తుందని అనుకున్నారు. కానీ తీరా చూస్తే అది కూడా సాధ్యం కాకపోవచ్చని ఇన్ సైడ్ టాక్.

ఓటిటి హక్కుల విషయంలో ఇంకా బేరాలు కుదరని కారణంగా రిలీజ్ నిర్ణయం వాయిదా పడుతోందని సమాచారం. అదే జరిగే పక్షంలో మే 9ని తమ తమ్ముడుకి లాక్ చేసుకునేందుకు నితిన్, నిర్మాత దిల్ రాజు ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. ఇదొక్కటే కాదు నిర్మాణంలో మరో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు అదే తేదీకి రావాలని కర్చీఫ్ వేసినా ఆశ్చర్యం లేదు.

ఒకవేళ ఇదే నిజమైతే విశ్వంభర వచ్చేది జూన్ లోనే. అది కూడా చివరి వారంలో అని ప్రచారం జరుగుతోంది. ఇది మెగా ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే విషయమే. యువి క్రియేషన్స్ ఆ కారణంగానే ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఆ మధ్య పాటల రికార్డింగ్ కు సంబంధించి ఫోటోలు విడుదల చేశారు కానీ కంటెంట్ ఏదీ చూపించలేదు.

టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం విఎఫ్ఎక్స్ రిపేర్లు చేయిస్తున్నారు. వాటిని నాగ్ అశ్విన్ పర్యవేక్షిస్తున్నారని వినిపిస్తున్నా నిర్ధారణగా తెలియదు. ఎలా చూసినా విశ్వంభర కోసం కనీసం ఇంకో నాలుగు నెలలు ఎదురు చూడటం తప్పేలా లేదు.