గౌతమ్ & చరణ్ – ఎవరు అన్ లక్కీ

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆర్ఆర్ఆర్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో యువి క్రియేషన్స్ భారీ ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా స్క్రిప్ట్ దాదాపు లాక్ చేశారు. అదే సమయంలో శంకర్ నుంచి పిలుపు రావడంతో చరణ్ మనసు మారింది. దీంతో గౌతమ్ ప్రాజెక్టు ఆగిపోయింది.

ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కల్ట్ డైరెక్టర్ ఇప్పుడు ఫామ్ లో లేడనే వాస్తవాన్ని మర్చిపోయి గేమ్ ఛేంజర్ కు చరణ్ ఎస్ చెప్పేశాడు. ఫలితంగా మూడేళ్ళ విలువైన కాలం నేల పాలయ్యింది. యావరేజ్ అయినా ఫ్యాన్స్ కి కొంత సంతృప్తి మిగిలేది కానీ దారుణంగా డిజాస్టర్ కావడం మెగాభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

తాజాగా రిలీజైన కింగ్ డమ్ టీజర్ చూశాక వస్తున్న డౌట్ ఒకటే. ఇది రామ్ చరణ్ కు చెప్పిన కథేనా లేక విజయ్ దేవరకొండ కోసం వేరేది రాసుకున్నాడా అని. ఒకవేళ ఒకటే అయితే మాత్రం ఫ్యాన్స్ ఇంకాస్త బాధ పడటం ఖాయం. ఎందుకంటే విజువల్స్, సెటప్, యాక్షన్ బ్లాక్స్ చూస్తుంటే గౌతమ్ తిన్ననూరి ఓ రేంజ్ లో తీశాడని అర్థమవుతోంది.

విజయ్ దేవరకొండకే అంత బాగా నప్పినప్పుడు చరణ్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేవాడన్నది వాస్తవం. ఒకవేళ వేరే స్టోరీ అయితే సమస్య లేదు కానీ ఇదంతా నిజమో కాదో చెప్పడానికి గౌతమ్, చరణ్ ఇద్దరి అందుబాటు ఇప్పట్లో జరగకపోవచ్చు.

చరణ్ సినిమా చేజారింది కాబట్టే దాని స్థానంలో చిరంజీవి విశ్వంభరని యువి ప్లాన్ చేసుకుందనేది మరో వెర్షన్. ఇదంతా యువి నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ ద్వారా జరిగిందనేది ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు.

అసలు గేమ్ ఛేంజర్ బదులు గౌతమ్ తిన్ననూరితోనే రామ్ చరణ్ ప్రొసీడయ్యుంటే ఇవాళ ఫలితం మరోలా ఉండేది. మహేష్ బాబుని ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. 3 ఇడియట్స్ రీమేక్ కోసం శంకర్, పొన్నియిన్ సెల్వన్ కోసం మణిరత్నం అడిగినప్పుడు అవి తనకు నప్పవని నో చెప్పాడని టాక్ ఉంది. ఇదే ప్లానింగ్ అంటే.