ఒకప్పుడు క్లాసిక్ ఫిలిం మేకర్ గా రాంగోపాల్ వర్మ అంటే ప్రేక్షకులకు విపరీతమైన గౌరవం, అభిమానం ఉండేవి కానీ గత కొన్నేళ్లుగా ఆయన తీస్తున్న కంటెంట్ స్థాయిని కిందకు తీసుకెళ్ళిపోయింది. రాజకీయ పార్టీలకు పని చేయడం మొదలుపెట్టాక పట్టించుకోవడం మానేశారు.
తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో వర్మ రజనీకాంత్ గురించి కామెంట్ చేస్తూ ఒకవేళ ఇప్పుడున్న 24 ఫ్రేమ్స్ కెమెరా జమానాలో సూపర్ స్టార్ ఉండి ఉంటే కనక ఇంత స్థాయికి వచ్చే వారు కాదని అర్థం వచ్చేలా వివాదాస్పద కామెంట్లు చేయడం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. కేవలం స్టయల్ తోనే రజని స్టార్ అయ్యారని వర్మ సారాంశం.
కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఎవరు రైటో అర్థమవుతుంది. రజని ఎప్పుడూ కేవలం స్టైల్ మీదే ఆధారపడలేదు. దళపతిలో తల్లి విసిరి పారేసిన అనాథగా పెరిగి, రౌడీగా మారాక స్నేహానికి ప్రాణమిచ్చే పాత్రలో ఎవరిని ఊహించుకోలేం. ఆరు పదుల వయసులో రోబో కోసం చాలా రిస్క్ చేసి గంటల తరబడి ప్రోస్తటిక్స్ మేకప్ వేసుకోవాల్సిన అవసరం రజనికి లేదు.
శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మీద సినిమా చేసిన ఒకే ఒక్క స్టార్ హీరో తలైవానే. బాషాలో స్థంబానికి కొట్టేసి విలన్ చితకబాదే సీన్ లో వర్షానికి తడుస్తూ ఒక్క మాట లేకుండా రజని ఇచ్చిన హావభావాల మీద ఒక పెద్ద విశ్లేషణ రాయొచ్చు. ముత్తులో ముసలి పాత్ర ఇదే బాపతే.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు వస్తూనే ఉంటాయి. అయినా ఇప్పుడు వర్మ హఠాత్తుగా రజని మీద ఎందుకు వెళ్లాడనే డౌట్ రావడం సహజం. గిరి కృష్ణ కమల్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన శారీ త్వరలో విడుదల కానుంది. దాని మీదకు దృష్టి వచ్చేలా వర్మ ఈ కాంట్రవర్సీ టాపిక్ తీసుకున్నాడనే అనుమానం జనంలో లేకపోలేదు.
అయినా ఎవరూ ఊరికే స్టార్లు అయిపోరు. టాలెంట్ తో పాటు కష్టపడే తత్వం ఉంటేనే పబ్లిక్ బ్రహ్మరథం పడుతుంది. అంతే తప్ప బట్టలు, స్టైల్ ని బట్టి కాదు. ఈ ఒక్క టాపిక్ పుణ్యమాని నెగటివ్ అయినా సరే వర్మ కోట్లలో ఉన్న రజనీకాంత్ ఫ్యాన్స్ దృష్టిలో పడ్డారు. కోరుకుంది ఇదేనేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates