బ్లాక్ బస్టర్ చూసి సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక హీరో మార్కెట్, బడ్జెట్ తగ్గడానికి బదులు పెరుగుతోందంటే అతని స్టార్ ఇమేజ్ చాలా పైనున్నట్టు అర్థం. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇదే స్టేజిలో ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ప్యాన్ ఇండియా మూవీకి ‘కింగ్ డం’ టైటిల్ ఖరారు చేస్తూ ఇవాళ రెండు నిమిషాల టీజర్ రిలీజ్ చేశారు.
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రన్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించగా అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.
ఎక్కడో నాగరిక ప్రపంచానికి దూరంగా ఒక సముద్ర తీర ప్రాంతం. నిత్యం రక్తం ఏరులై ప్రవహిస్తుంది. వందలాది శవాలు ఎవరివో గుర్తు పట్టేలోగానే మరికొన్ని వాటికి తోడవుతూ ఉంటాయి. భూమిలో పాతి పెట్టిన మృతదేహాలకు లెక్క లేదు. ఒకపక్క తుపాకులు పట్టిన మాఫియా శక్తులు, ఇంకో వైపు ఆర్మీ దుస్తుల్లో ఉన్న రాక్షసులు.
వీళ్ళ మధ్య క్షణమొక యుగంగా బ్రతుకుతున్న సమూహం ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు వస్తాడు అతను (విజయ్ దేవరకొండ). బుల్లెట్లకు భయపడకుండా, పోలీసులకు నెరవకుండా మొత్తం తగలబెట్టేందుకు సిద్ధపడతాడు. అతనికీ సామ్రాజ్యం ఎలా హస్తగతమయ్యిందనేది చూడాలి.
ఇప్పటిదాకా సున్నితమైన కథలనే తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఇంత వయొలెంట్ బ్యాక్ డ్రాప్ ని చూపిస్తాడని ఊహించని విధంగా కింగ్ డం సెటప్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. శ్రీలంకలో శరణార్ధుల నేపధ్యాన్ని తీసుకున్న గౌతమ్ చాలా ఇంటెన్స్ తో యాక్షన్ ఎపిసోడ్స్ కి తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది.
అనిరుద్ బిజిఎంకి తోడు, సహజంగా అనిపిస్తున్న బ్యాక్ డ్రాప్ అంచనాలు పెంచేలా ఉన్నాయి. కురచ జుత్తుతో విజయ్ దేవరకొండ లుక్స్, నటన చాలా డెప్త్ గా కనిపిస్తున్నాయి. వేరే క్యాస్టింగ్ రివీల్ చేయలేదు. తారక్ స్వరం కంటెంట్ ని ఎలివేట్ చేసింది. మే 30 ప్రపంచవ్యాప్తంగా కింగ్ డం ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.