లైలాకు ‘A’ సర్టిఫికెట్….ఇది పెద్ద పరీక్షే

సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే. అయితే పెద్ద మల్టీప్లెక్సులు తప్ప ఈ నిబంధనను పాటించే వాళ్ళు తక్కువ. అందుకే యానిమల్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లను చిన్న పిల్లలు సైతం థియేటర్లలో చూసి ఎంజాయ్ చేశారు.

అలాని వాటిలో మరీ భయపడే కంటెంట్ లేకపోయినా కొంచెం అడల్ట్స్ ఓన్లీ అనిపించే సన్నివేశాలు, వయొలెన్స్ లేకపోలేదు. తాజాగా లైలా కూడా A తెచ్చుకుంది. ఎల్లుండి రిలీజ్ కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ మీద గత మూడు రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా రచ్చ చూస్తూనే ఉన్నాం.

నటుడు పృథ్వి చేసిన పొలిటికల్ కామెంట్స్ కి పెద్ద డ్యామేజే జరిగింది. కాకపోతే నెగటివ్ అయినా సరే లైలాకు పబ్లిసిటీ కూడా జరిగిపోయింది. సినిమా ఎక్కువ శాతం ఆడియన్స్ దృష్టిలో పడేందుకు దోహదం చేసింది. ఇదంతా బాగానే ఉంది కానీ లైలాకు ఏ సర్టిఫికెట్ ఏ మేరకు ప్రతిబంధకంగా మారుతుందో వేచి చూడాలి.

ఎందుకంటే ప్రమోషన్ల కోసం సంక్రాంతికి వస్తున్నాం చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజుని వాడారు. తీరా చూస్తేనేమో చిన్న పిల్లలకు లైలా థియేటర్లలో నో ఎంట్రీ. అంటే బూతు జోకులు, ఎపిసోడ్లు ఎన్నో కొన్ని ఉన్నాయనేగా అర్థం. విశ్వక్ కూడా పలు ఇంటర్వ్యూలలో అదే చెప్పాడు.

సో యునానిమస్ టాక్ రావడమనేది లైలాకు చాలా కీలకం. పోటీ పెద్దగా లేదు. బ్రహ్మ ఆనందం రేసులో ఉంది కానీ క్యాస్టింగ్ దృష్ట్యా అదిరిపోయిందనే మాట వినిపిస్తే తప్ప జనాలు అదే పనిగా టికెట్లు కొనడం డౌటే. ఇంకోవైపు రీ రిలీజుల తాకిడి ఎక్కువగా ఉంది. ఆరంజ్ తో సహా నాలుగైదు ఒకేసారి వదులుతున్నారు.

వీటి ఎఫెక్ట్ మరీ తీవ్రంగా ఉండకపోవచ్చు. ఒకవేళ లైలాలో కనక డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువగా ఉందనే టాక్ వస్తే మాత్రం ఫ్యామిలీ సెక్షన్ దూరంగా నిలబడే ప్రమాదముంది . యూత్ కైనా సరే జోక్స్ తో పాటు కంటెంటూ బలంగా ఉండాలి. మరి ఆడవేషంలో లైలా ఇవన్నీ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.