చిరంజీవి చెప్పిన బ్రహ్మానందం కథ

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న బ్రహ్మ ఆనందం ప్రమోషన్ల పరంగా అన్ని చేస్తున్నా ఒక బలమైన పుష్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అది చిరంజీవి రూపంలో దొరికింది. ఇవాళ ఆయన ముఖ్యఅతిథిగా ప్రీ రిలీజ్ వేడుకని బ్రహ్మాండంగా నిర్వహించారు.

బ్రహ్మి గారబ్బాయి రాజా గౌతమ్ ఇందులో ఆయన మనవడిగా హీరో పాత్ర పోషించగా వెన్నెల కిశోర్ మరో ముఖ్యమైన క్యారెక్టర్ దక్కించుకున్నాడు. సినిమా సంగతి కాసేపు పక్కనపెడితే చిరు, బ్రహ్మానందం మధ్య ఎంతటి బంధం ఉందో ప్రపంచానికి తెలిసిందేందుకు ఈవెంట్ ఉపయోగపడింది. స్వయంగా మెగాస్టార్ మాటల్లో ఆ కథేంటో బయటికొచ్చింది.

చంటబ్బాయి షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న సమయంలో జంధ్యాల గారు అట్లాంటి ఇట్లాంటి హీరోను కాదు నేను అనే పాటను చిరంజీవికి చార్లీ చాప్లిన్ గెటప్ వేసి సుహాసినితో పాటు చిత్రీకరిస్తున్నారు. ఒక పొడవైన దిమ్మె మీద డాన్సు చేసే బిట్ అది. ఇది జరుగుతుండగా కెమెరాకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఆనందంతో బిగ్గరగా అరిస్తే అతన్ని పక్కకు తప్పించారు.

తీరా తర్వాత తెలిసింది ఏంటంటే అతని పేరు బ్రహ్మానందం, లెక్చరర్ గా పని చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడని. హోటల్ రూమ్ కు వచ్చాక అతను చేసిన మిమిక్రి, వేసిన జోకులకు చిరంజీవి అలా నవ్వుతూనే ఉండిపోయారు.

అప్పటికప్పుడు ఫ్లైట్ లో వేరొకరికి బుక్ చేసిన టికెట్ ని బ్రహ్మానందంకు వేయించి మదరాస్(చెన్నై) కు తీసుకెళ్లారు చిరంజీవి. ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టాక తమ్ముళ్లు ఇద్దరూ ఆశ్చర్యంతో ఇదంతా గమనించారు. అక్కడి నుంచి చిరు తన పరిచయాలను ఉపయోగించి బ్రహ్మానందంకు ఎన్నో అవకాశాలు వచ్చేలా చేశారు.

చంటబ్బాయ్ లో కనిపించి కనిపించకుండా ఉండే రన్నింగ్ వేషం నుంచి వెయ్యికి పైగా సినిమాల్లో నటించే గొప్ప కెరీర్ కి పునాది వేశారు. నాలుగు దశాబ్దాలుగా ఈ అనుబంధం ఇలా కొనసాగుతూనే ఉంది. గతంలో బ్రహ్మి ఓ ఇంటర్వ్యూలో ఈ జ్ఞాపకాన్ని పంచుకున్నారు కానీ ఇంత డీటెయిల్డ్ గా తెలిసింది మాత్రం ఇవాళే.