ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న లైలా విషయంలో విశ్వక్ సేన్ చాలా టెన్షన్ గా ఉన్నాడు. చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా వచ్చి హుషారు నింపారని ఆనందించే లోపే పృథ్వి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చాలా డ్యామేజ్ చేశాయి. దీంతో హీరో, దర్శకుడు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దయ చేసి సినిమాను చంపకండని విన్నపం చేసుకున్నారంటే పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఒక్క రోజే సుమారు 60 వేల దాకా బ్యాన్ లైలా ట్వీట్లు సోషల్ మీడియాని ముంచెత్తాయి. విశ్వక్ రిక్వెస్ట్ లో నిజాయితీ ఉండటంతో యాంటీ వర్గాలు కాస్త మెత్తబడ్డాయి.
ప్రస్తుతానికి వ్యవహారం కూల్ గా కనిపిస్తున్నా మొదటి ఆట అయిపోయి టాక్ బయటికి వచ్చేదాకా విశ్వక్ మాములు కావడం కష్టమే. ఎందుకంటే బజ్ విషయంలో లైలా వెనుకబడే ఉంది. ఆడ గెటప్ లో యూత్ హీరో చేసే కామెడీ మీద జనాలు ఏ మాత్రం ఆసక్తిగా ఉన్నారో మొదటి రోజు వసూళ్లు చెప్పబోతున్నాయి. చాలా సంవత్సరాలుగా ఈ ప్రయోగం ఎవరూ చేయకపోవడంతో విశ్వక్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పోటీగా ఉన్న బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సైతం చిరంజీవే అతిథిగా హాజరు కానుండటం మరో విశేషం. హైప్ పరంగా లైలానే కాస్త పైనుంటుంది.
ఇది పెద్ద హిట్ కావడం విశ్వక్ సేన్ కు చాలా అవసరం. ఎందుకంటే గంపెడాశలు పెట్టుకున్న మెకానిక్ రాకీ తీవ్రంగా నిరాశ పరిచింది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి కమర్షియల్ గా కొంత పే చేసింది కానీ కెరీర్ బెస్ట్ అవ్వలేకపోయింది. అంతకు ముందు గామీ బడ్జెట్ తక్కువ కాబట్టి రిస్క్ లేకుండా బయటపడింది. దాస్ కా ధమ్కీ లాంటివి కూడా సోసోగానే ఆడాయి. ఈసారి సేఫ్ గేమ్ వదిలిపెట్టి పెద్ద రిస్క్ తీసుకున్న విశ్వక్ లైలా కోసం చాలా కష్టపడ్డాడు. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటిదాకా ఓ మోస్తరు అంచనాలు రేకెత్తించింది కానీ పబ్లిసిటీ పరంగా ఇంకాస్త పుష్ కావాలి. ఫిబ్రవరి 14 వచ్చే టాక్ పాజిటివ్ గా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి.