ఇటీవలే జరిగిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ గెస్టుగా వచ్చిన దిల్ రాజుని ఉద్దేశించి యథాలాపంగా అన్న మాటలు గేమ్ ఛేంజర్ ని ఉద్దేశించినవని భావించిన కొందరు మెగా ఫ్యాన్స్ ఆయన మీద ట్రోలింగ్ కు దిగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
దీని గురించి మీడియా పలు సందర్భాల్లో వివరణ అడిగే ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత చెబుతానని అరవింద్ దాటవేశారు. ఇవాళ తండేల్ పైరసీ గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. తన మనసులో దీనికి సంబంధించిన భావోద్వేగాన్ని ఇప్పుడు పంచుకోవాలని ఉందని బన్నీ వాస్, ఎస్కెఎన్ వెళ్ళిపోయాక చెప్పారు.
రామ్ చరణ్ తనకు కొడుకు లాంటి వాడని, తనకున్న ఒకే ఒక మేనమామ నేనేనని, నాకున్న ఒకే ఒక్క మేనల్లుడు అతనేనని, ఇద్దరి మధ్య ఎంత బంధం ఉందో తమకే తెలుసని దయచేసి బురద చాల్లే ప్రయత్నం చేయొద్దని ట్రోలర్స్ ని కోరారు. దాంతో పాటు అపార్థం చేసుకున్న మెగా ఫ్యాన్స్ కు స్పష్టత ఇచ్చారు.
మరింత అడగబోయే జర్నలిస్టులను వారించి దయచేసి ఎమోషన్ కు సంబంధించిన విషయాన్ని ఇంతకన్నా లోతుగా తవ్వొద్దని రిక్వెస్ట్ చేశారు. ఇదంతా చెబుతున్నప్పుడు మాటలతో పాటు అరవింద్ ముఖ కవళికల్లో పొరపాటున ఇదంతా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదనే భావనే కనిపిస్తూనే ఉంది.
దీంతో మబ్బులు వీడిపోయి నట్టే అనుకోవాలి. దిల్ రాజు ఒకే వారం రకరకాల ఒడిదుడుకులు చూశారని చెప్పాలనుకుని ఇంకో రకంగా చెప్పడం వల్ల అదేదో రామ్ చరణ్ ని అన్నట్టుగా వెళ్ళిపోయిన వైనాన్ని అల్లు అరవింద్ గమనించారు. అందుకే కొన్ని రోజులు ఆలస్యమైనా చివరికి శుభం కార్డు పలికారు.
పుష్ప 2 విడుదలకు ముందు నుంచి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ లా మారిపోయిన సోషల్ మీడియా ట్రోల్స్ గేమ్ ఛేంజర్ నుంచి కొత్త మలుపు తిరిగాయి. నిన్న చిరంజీవి పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేయగా ఇవాళ అరవింద్ రామ్ చరణ్ మీద ప్రేమను ప్రకటించి గ్యాప్ మరింత తగ్గించే ప్రయత్నం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates