మనిషికి మంచి తిండి, సుఖమైన నిద్ర అత్యంత ముఖ్యమైన విషయాలు. నిద్ర విషయానికి వస్తే.. ఏ వయసులో అయినా సరే కనీసం ఆరు గంటలు పడుకోవాలని వైద్యులు చెబుతారు. ఆ మాత్రం నిద్ర లేకపోతే ఏ పనీ సరిగా చేయలేమని అంటారు. కానీ కొంతమంది మాత్రం తక్కువ నిద్రతోనే యాక్టివ్‌గా ఉంటారు. అన్ని పనులూ సవ్యంగా చేసేస్తారు. ఐతే మరీ రెండు గంటల నిద్రతో సరిపెట్టుకోవడం అంటే ఎలాంటి వ్యక్తికైనా కష్టమే. కానీ సల్మాన్ మాత్రం తాను రోజూ రెండు గంటలు మాత్రమే నిద్రపోతానని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు.
‘‘నేను సాధారణంగా రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్ర పోతాను. నెలలో ఒక్క రోజు మాత్రమే ఎనిమిది గంటలు పడుకుంటాను. కొన్నిసార్లు సినిమా చిత్రీకరణ సమయంలో సన్నివేశాల మధ్య విరామం వచ్చినప్పుడు కాసేపు కునుకు తీస్తాను’’ అని సల్మాన్ చెప్పాడు. సల్మాన్ ఎంత బిజీ నటుడైనప్పటికీ నిద్ర అన్నది మనిషికి అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి కాబట్టి.. మరీ రెండు గంటలు నిద్ర పోవడం ఏంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఐతే తాను వరుసగా రోజూ ఎనిమిది గంటలు పడుకున్న రోజులు కూడా ఉన్నాయంటూ సల్మాన్.. జైల్లో గడిపిన రోజులను గుర్తు చేసుకోవడం విశేషం. ‘‘నేను షూటింగ్‌లు లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కావాల్సినంత నిద్ర పోతాను. అందుకే జైల్లో ఉన్నప్పుడు హాయిగా 8 గంటలు నిద్రపోయాను. విమాన ప్రయాణాల్లో ఉన్నపుడు, ముఖ్యంగా ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి ఆలస్యం అయితే ఆ సమయంలో కూడా నేను ఎక్కువగా నిద్రపోతాను.
ఎందుకంటే అప్పుడు నేనేం చేయలేను కదా’’ అని సల్మాన్ అన్నాడు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో, ఒక కారు ప్రమాదానికి సంబంధించిన కేసులో సల్మాన్ వేర్వేరుగా జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న ‘సికందర్’ రంజాన్ కానుకగా వచ్చే నెలలో విడుదల కానుంది.