‘స్వాగ్’ చూపించాడు.. ‘సింగిల్’ అవతారమెత్తాడు

విలక్షణ చిత్రాలతో యువ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు.. శ్రీ విష్ణు. ముందు క్యారెక్టర్ రోల్స్ చేసినా.. తర్వాత హీరో పాత్రలకు మారి, హిట్లు కొట్టడంతో తన స్థాయి పెరిగింది. శ్రీ విష్ణు సినిమా అంటే ఏదో ఒక వైవిధ్యం ఉంటుందనే భరోసా ప్రేక్షకుల్లో ఉంది. గత ఏడాది అతను ‘స్వాగ్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. విడుదలకు ముందు ఈ సినిమా మంచి హైపే తెచ్చుకుంది. కానీ ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఐతే బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్న ఆ చిత్రం.. ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. కొన్ని రోజుల పాటు ఆ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. థియేటర్లలో సరిగా ఆడకపోయినా.. ఈ స్పందన శ్రీ విష్ణుకు ఆనందాన్ని ఇచ్చే ఉంటుంది. ఈ ఉత్సాహంలో అతను తన కొత్త సినిమాల పనిలో పడిపోయాడు. తన నెక్స్ట్ రిలీజ్‌కు సంబంధించి ఈ రోజు అప్‌డేట్ కూడా వచ్చింది.

శ్రీ విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం పేరు ఈ రోజు ప్రకటించారు. ‘సింగిల్’ అనే ట్రెండ్ టైటిల్ పెట్టారీ చిత్రానికి. సోషల్ మీడియా కాలంలో పెళ్లి కాని వారిని సింగిల్ అని సంబోధిస్తూ కామెంట్లు చేయడం కామన్. ఈ మాట బాగా పాపులర్ అయింది. కాబట్టి ఇది యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే టైటిల్ అనే చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇంట్రెస్టింగ్‌‌గా కనిపిస్తోంది. శ్రీ విష్ణు నుంచి యూత్ ఆశించే అల్లరి ఈ సినిమాలో ఉంటుందనే అనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం. కావ్య ఫిలిమ్స్ అనే మరో నిర్మాణ సంస్థకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. సందీప్ కిషన్‌తో ‘నిను వీడని నీడను నేనే’ సినిమా తీసిన కార్తీక్ రాజు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నది వెల్లడి కాలేదు. ఈ రోజు సాయంత్రం విడుదల కానున్న ఫస్ట్ గ్లింప్స్‌లో ఆ విషయం తెలియొచ్చు. వేసవిలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు.