నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన తండేల్ మొదటి వారాంతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది, యూనిట్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఫస్ట్ వీకెండ్ గ్రాస్ మూడు రోజులకు గాను 62 కోట్ల 37 లక్షలు. అంటే నిర్మాత బన్నీ వాస్ హామీ ఇచ్చినట్టు వంద కోట్ల మార్కు చేరుకోవడానికి ఇంకో ముప్పై ఏడు కోట్లు కావాలన్న మాట.
అయితే వీకెండ్ డ్రాప్స్ ఎంత మొత్తంలో ఉంటాయనే దాన్ని బట్టి నెంబర్లు ఎంత త్వరగా చేరుకుంతుంటుందనేది ఆధారపడి ఉంటుంది. ఏపీలో వారం రోజులకు టికెట్ రేట్ పెంపు తీసుకున్న టీమ్ ప్రస్తుతం సాధారణ ధరలు తీసుకొచ్చే ఆలోచన చేస్తోందట.
అసలు పరీక్ష తండేల్ కు ఇక ముందు ఉంది. టాక్ పాజిటివ్ గానే ఉంది కానీ సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప 2 లాగా ఎక్స్ ట్రాడినరిగా లేదు. పైగా మాస్ ఆడియన్స్ మద్దతు ఎంతమేరకు కొనసాగుతుందనేది వేచి చూడాలి. నైజాంలో ఎలాంటి సమస్య లేదు. స్ట్రాంగ్ గా ఉంది.
ముఖ్యంగా హైదరాబాద్ లో హౌస్ ఫుల్ బోర్డులు చాలా పడ్డాయి. బుక్ మై షో గత ఇరవై నాలుగు గంటల్లో సుమారు లక్షా తొంబై వేల టికెట్లు ముందస్తుగా అమ్ముడుపోవడం తండేల్ టాక్ ఎలా వెళ్లిందనేది సూచిస్తోంది. అన్ని భాషల్లో ఇంత భారీ మొత్తం వేరే ఏ సినిమాకు బుకింగ్స్ జరగలేదన్నది వాస్తవం. అయితే హిందీ వెర్షన్ పికప్ కీలకం కానుంది.
ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్లు చేసినప్పటికీ తండేల్ ఇతర భాషల్లో ఇంకా మేజిక్ చేయాల్సి ఉంది. ఎందుకంటే నార్త్ మార్కెట్ మద్దతు లేనిదే వందల కోట్ల కలెక్షన్లు సాధ్యం కావు. బాలీవుడ్ వెర్షన్ నెమ్మదిగా ఉంది. సముద్ర నేపథ్యం మినహాయించి పాకిస్థాన్ జైల్ ఎపిసోడ్ లాంటివి వాళ్ళు గతంలో చాలా చూశారు కాబట్టి కంటెంట్ పరంగా రీచ్ ఎక్కువగా లేదనేది విశ్లేషకుల మాట.
పుంజుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. దీన్ని పక్కనపెడితే తెలుగు వరకు తండేల్ స్పీడ్ అయితే బాగానే ఉంది కానీ సోమవారం నుంచి గురువారం దాకా ఆక్యుపెన్సీలు ఎలా నిలబెట్టుకుందనే దాని మీదే రేంజ్ ఆధారపడి ఉంటుంది.