ఇండస్ట్రీ లో కాంపౌండ్ లపై చిరు కామెంట్!,

‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఐక్యతపై, ఫ్యాన్ వార్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, మొదటిసారిగా పుష్ప-2 చిత్రం గురించి చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 పెద్ద హిట్టయిందని, బ్లాక్ బస్టర్ అయిందని, అందుకు తాను గర్విస్తున్నానని చిరు అన్నారు. బాలకృష్ణ కాంపౌండ్..మెగా కాంపౌండ్..అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విష్వక్సేన్ భలే సమాధానం చెప్పాడని చిరు అన్నారు.

ఫిలిం ఇండస్ట్రీకి కాంపౌడ్ లేదని చెప్పిన విశ్వక్ సేన్ ను అభినందిస్తున్నానని చెప్పారు. మనుషులన్నాక వేరే వాళ్లపై అభిమానం, ప్రేమ ఉంటాయని, రామ్ చరణ్ కు సూర్య అంటే చాలా ఇష్టం అని, అంతమాత్రాన చెర్రీ ఫంక్షన్ కు తాను వెళ్లకూడదా అని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో హీరోలు గిరిగీసుకుని ఉన్న రోజులు గతంలో ఉన్నాయని, కానీ, అది షూటింగుల వరకేనని చెప్పారు.

అయితే, అది తెలియక అభిమానులు కొట్టుకుచచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నారు. మద్రాస్ లో గతంలో హనీ హౌస్ ఉండేదని, తెలుగు, తమిళ ఇండస్ట్రీ వారు అక్కడ పార్టీలు, ఫంక్షన్ లు చేసుకునేవారని చెప్పారు. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణలతో తాను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటానని, నాగార్జున, తాను తరచుగా కలుస్తుంటామని అన్నారు.

విశ్వక్ పై ఒక ముద్ర వేసి, అతడి ఫంక్షన్లకు వెళ్లకూడదని అనుకోవడం సరికాదని అన్నారు. అతడు ఇండస్ట్రీలో, మన కుటుంబంలో ఒకడు అని సందేశాన్ని అందించాలని చెప్పారు. ఓ నిర్మాత తనకు ఇస్తున్న అడ్వాన్స్ మరో హీరోతో తీసిన సినిమా ద్వారా వచ్చినవే కదా అని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో అందరూ అవినాభావ సంబంధంతో ఉండాలని, అప్పుడే మంచి వాతావరణం ఉంటుందని చెప్పారు.