ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించినా పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ ఏదీ జరగలేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉండిపోయిన మాట వాస్తవమే. అయితే ఎన్ని వందల కోట్లు వసూలవుతున్నా దురదృష్టవశాత్తు సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన వల్ల దాన్ని పబ్లిక్ గా సెలెబ్రేట్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది.
ఎట్టకేలకు క్రమంగా ఆ విషాదం నుంచి బయటికి వస్తున్న బన్నీ రెండు నెలల తర్వాత పుష్ప 2 థాంక్స్ మీట్ లో ఓపెన్ స్టేజి మీద ఆనందంగా కనిపించాడు. అందులోనూ హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చేసి తన రెగ్యులర్ లో లుక్ లోకి వచ్చేసి చాలా కబుర్లే పంచుకున్నాడు. అరవై రోజుల వెలితి తీర్చుకున్నాడు.
తన పాటలు మిలియన్లు చేస్తే చాలనుకుంటే ఏకంగా బిలియన్ల రుచి చూపించిన దేవిశ్రీ ప్రసాద్ కు బన్నీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. పుష్ప 2 స్మూత్ రిలీజ్ కోసం సహకరించిన అన్ని బాషల పరిశ్రమలకు ధన్యవాదాలు తెలిపి, సరైన గైడెన్స్ లేకపోతే ఒక మంచి నటుడు బ్యాడ్ యాక్టర్ గా మారే ప్రమాదముందని, అలా సుకుమార్ పరిచయం తనను ఈ స్థాయికి చేర్చిందని ఫ్రెండ్ గురించి గొప్పగా చెప్పాడు.
ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కు నేనో మరొకరో కారణం కాదని కేవలం సుకుమార్ మాత్రమేనని చెప్పి మరోసారి స్నేహభావాన్ని గర్వంగా చాటుకున్నాడు. అయిదు సంవత్సరాలు సుకుమార్ ని పిచ్చోళ్లలా ఫాలో అయ్యామని నవ్వించాడు.
పుష్ప 3 గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అయితే అదేంటో తనకు సుకుమార్ కు ఇద్దరికీ తెలియదని కాలం నిర్ణయిస్తుందని సంకేతం ఇవ్వడం చూస్తే మూడో భాగం ది ర్యాంపేజ్ ఇప్పట్లో లేదని అర్థం చేసుకోవచ్చు. అల్లు ఆర్మీని మరింత గర్వపడేలా సినిమాలు చేస్తానని బన్నీ సభాముఖంగా హామీ ఇచ్చేశాడు.
మొత్తానికి ఐకాన్ స్టార్ ప్రసంగంలో ఆనందం, భావోద్వేగం రెండూ కనిపించాయి. ఫ్యాన్స్ హడావిడి లేకుండా కేవలం పరిమిత ఆహ్వానితులు, మీడియా మధ్య జరిగిన పుష్ప 2 ఈవెంట్ తో పబ్లిసిటి కథ ముగింపుకొచ్చింది. తిరిగి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా మూవీ మొదలయ్యే దాకా అభిమానులు ఎదురు చూడాల్సిందే.