‘పుష్ప-2’లో పరుచూరిని ఆశ్చర్యపరిచిన సీన్

రెండు నెలల కిందట విడుదలైన ‘పుష్ప-2’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. మాతృక అయిన తెలుగు వెర్షన్ ఓ మోస్తరుగా ఆడింది కానీ.. హిందీ వెర్షన్ మాత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్ల మోత మోగించి ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇలా మంచి క్రేజున్న రిలీజైన కొన్ని వారాలకు టాలీవుడ్ లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తన ‘పరుచూరి పలుకులు’ యూట్యూబ్ ఛానెల్లో విశ్లేషణలు చేస్తుంటారు. తాజాగా ఆయన ‘పుష్ప-2’ మీద విశ్లేషణ చేశారు. ఇందులో సినిమాలోని కీలక మలుపుల గురించి.. అలాగే తనను ఆశ్చర్యపరిచిన విషయాల గురించి ఆయన మాట్లాడారు.సినిమాలో షెకావత్‌కు పుష్ప సారీ చెప్పే సన్నివేశంలో తాను బోల్తా కొట్టినట్లు పరుచూరి చెప్పారు.

హీరో విలన్‌కు సారీ చెప్పడాన్ని ప్రేక్షకులు అంగీకరించరని.. కాబట్టి హీరో సారీ చెప్పడని తాను అనుకున్నానని పరుచూరి చెప్పారు. ఈ సన్నివేశం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. హీరో సారీ చెప్పకుండా వేర ఏదో ప్లాన్ చేస్తారేమో అని తాను అనుకున్నానని.. కానీ సుకుమార్ తన ఆలోచనలకు భిన్నంగా ఈ సీన్ డిజైన్ చేశాడని పరుచూరి చెప్పారు. ఐతే పుష్పరాజ్‌లో ప్రతినాయక ఛాయలు ఉండడం, అతను ఒక స్మగ్లర్ కావడం వల్లే ప్రేక్షకులు ఈ సన్నివేశాన్ని అంగీకరించారన్నారు.

సాధారణంగా ధర్మాన్ని పాటించే హీరో సారీ చెబితే ప్రేక్షకులు తట్టుకోలేరన్నారు. ముఖ్యమంత్రి తనతో ఫొటో దిగకపోవడం అనే సిల్లీ రీజన్‌ మూడు గంటల 40 నిమిషాల కథకు కారణమైనప్పటికీ.. సుకుమార్ ఎంతో నేర్పుగా కథనాన్ని నడిపారని పరుచూరి చెప్పారు. సినిమాలో షెకావత్ చనిపోయినట్లుగా చూపించారని.. కానీ అంత పెద్ద విలన్ ఆత్మాహుతి చేసుకుని చనిపోవడం కరెక్ట్ కాదని.. పుష్ప-3 తీస్తే అతను బతికే ఉన్నట్లు చూపిస్తారని అభిప్రాయపడ్డారు పరుచూరి.