రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్ ఇస్తాడనుకుంటే అది కూడా నిరాశపరిచింది. అంతకు భీమా కమర్షియల్ గా జస్ట్ ఓకే అనిపించుకున్నా హిట్ ముద్ర పడలేదు. ఇక రామబాణం, పక్కా కమర్షియల్, ఆరడుగుల బులెట్, చాణక్య, పంతం వగైరాల సంగతి సరేసరి.

తనవరకు ఎంత కష్టపడాలో అంతా చేస్తున్న గోపీచంద్ కు సరైన కంటెంట్ పడటం లేదు. తాజాగా మరో రెండు రిస్కులకు రెడీ అవుతున్నాడట. ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్ల ప్రోజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఆల్రెడీ కథలు నచ్చి స్క్రిప్ట్ దశకు వెళ్లాయట.

మొదటి పేరు సంపత్ నంది. ఈ కలయికలో సీటిమార్ వచ్చింది. పెద్దగా ఆడలేదు. అంతకు ముందు గౌతమ్ నందాకు డీసెంట్ వసూళ్లు దక్కాయి కానీ విజయాల ఖాతాలో చేరలేదు. అయినా సరే సంపత్ మాస్ పల్స్ మీద గోపీచంద్ కు గురి ఎక్కువ. అందుకే మూడో ఛాన్స్ ఇచ్చాడని సమాచారం.

ప్రస్తుతం సంపత్ నంది హీరో శర్వానంద్ తో భారీ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది కాగానే ఇటువైపు రావొచ్చు. ఇక రెండో పేరు సంకల్ప్ రెడ్డి. నిజ జీవితంలో జరిగిన స్ఫూర్తి భరిత సంఘటనలు కథగా రాసుకునే ఇతనికి ఘాజి తర్వాత అంతరిక్షం, ఐబి 71 ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి.

ఇప్పుడు గోపీచంద్ కోసం మంచి పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ కంటెంట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ముందు ఇదే మొదలు కావొచ్చని అంటున్నారు. ఇక్కడ చెప్పిన రెండు కలయికలు ఇంకా అధికారిక ప్రకటన దాకా రాలేదు. వస్తే తప్ప ఖరారుగా చెప్పలేం. వీటికన్నా ముందు జిల్ – రాధే శ్యామ్ ఫేమ్ రాధాకృష్ణతో గోపీచంద్ ఒక మూవీ చేయబోతున్నాడట.

లైనప్ అయితే రెడీ అవుతోంది కానీ స్టార్ట్ కావడంలో జాప్యం జరుగుతోంది. ఇవన్నీ ఒకే కానీ జయం, నిజం తరహాలో గోపీచంద్ మరోసారి వయొలెంట్ విలనిజం చేయాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. అదిప్పట్లో జరిగే పనైతే కాదు.