అల్లు అర్జున్‌కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్ అయ్యాడు. స్టార్ ఇమేజ్ వచ్చాక లవ్ స్టోరీలు చేయడం కష్టమే. బన్నీ కూడా ఎక్కువగా మాస్, యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేస్తూ సాగిపోయాడు. ఇప్పుడు అతనున్న స్థాయిలో ప్రేమకథను అస్సలు ఆశించలేం. కానీ బన్నీ మాత్రం పూర్తి స్థాయి ప్రేమకథ చేయాలనుకుంటున్నాడట. ఈ విషయమై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు హామీ కూడా ఇచ్చాడట.
తాను సంగీతం అందించిన ‘తండేల్’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మీడియాను కలిసిన దేవి.. ఈ విషయం వెల్లడించాడు. ‘తండేల్’ మూవీకి దేవిని సంగీత దర్శకుడిగా పెట్టుకోమని టీంకు సూచించింది బన్నీనేనట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బన్నీకి ప్రేమకథలంటే ఎంతిష్టమో చెప్పిన దేవి.. ఆరు మెలోడీలతో ఒక లవ్ స్టోరీ చేద్దామని తనతో బన్నీ అన్న విషయాన్ని వెల్లడించాడు.
‘‘మిగతా జానర్లతో పోలిస్తే ప్రేమకథా చిత్రాలు ఎక్కువ కాలం నిలబడతాయి. దేవదాస్, గీతాంజలి, ఆర్య.. ఇలాంటి సినిమాలన్నీ అందరికీ గుర్తుండిపోవడానికి కారణమదే. ప్రేమ పాటలు కూడా ఎక్కువ కాలం నిలబడతాయి. అల్లు అర్జున్‌కు ఇప్పటికీ ఒక కోరిక ఉంది. ఆరుకు ఆరు ప్రేమ పాటలు ఉండే అందమైన లవ్ స్టోరీ ఒకటి చేయాలని. ఇదే విషయాన్ని ఈ మధ్య బన్నీ నాకొక పేపర్ మీద రాసి ఇచ్చాడు.
గుర్తు పెట్టుకో, మనం ఇలాంటి సినిమా ఒకటి చేద్దాం అని మ్యానిఫెస్టోలాగా సంతకం చేసి ఇచ్చాడు’’ అని దేవి వెల్లడించాడు. ఐతే ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న బన్నీ.. కెరీర్లో ఈ దశలో ఇక ప్రేమకథ చేయగలడా అన్నది సందేహం. ప్రభాస్ ఇలాగే ఇమేజ్‌ను పక్కన పెట్టి ‘రాధేశ్యామ్’ రూపంలో లవ్ స్టోరీ చేస్తే బెడిసికొట్టింది. మరి బన్నీ అలాంటి సాహసానికి పూనుకుంటాడా అన్నది ప్రశ్న. ప్రస్తుతం అతను త్రివిక్రమ్ సినిమాకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.