క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం స్టార్ కాదు.. ఒకేసారి సూపర్ స్టార్ అయిపోయాడతను. కానీ ఆ తర్వాత అతణ్ని వరుసగా పరాజయాలు వెంటాడాయి. అలాంటి టైంలో హృతిక్‌ కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించిన సినిమా.. కోయీ మిల్ గయా. ‘కహోనా ప్యార్ హై’ తీసిన హృతిక్ తండ్రి రాకేష్ రోషనే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు.

ఇండియాలో సీక్వెల్స్ పెద్దగా పాపులర్ కాని టైంలో ఆయన ‘కోయీ మిల్ గయా’కు కొనసాగింపుగా క్రిష్, క్రిష్-3 సినిమాలను తీస్తే అవి కూడా బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఐతే క్రిష్-3 వచ్చి పుష్కర కాలం గడిచిపోయింది. ఈ ఫ్రాంఛైజీలో నాలుగో సినిమా ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఎప్పుడో స్క్రిప్టు కూడా రెడీ అయింది. కానీ ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.

మధ్యలో రాకేష్ క్యాన్సర్ బారిన పడడం వల్ల ఈ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. ఆయన కోలుకుని సినిమా తీయడానికి రెడీ అయ్యారు. అయినా క్రిష్-4 కార్యరూపం దాల్చట్లేదు. ఇందుకు కారణమేంటో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు రాకేష్ రోషన్. బడ్జెట్ సమస్యల వల్లే క్రిష్-4ను సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోతున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం మన ప్రేక్షకులు వరల్డ్ సినిమాను విపరీతంగా చూస్తున్నారని.. ఈ నేపథ్యంలో క్రిష్-4ను అంతర్జాతీయ ప్రమాణాలతోనే తీయాల్సి ఉంటుందని.. అందుకోసం భారీ బడ్జెట్ అవసరమని ఆయన చెప్పారు. కానీ తాము అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఆయన వెల్లడించారు. క్రిష్ సిరీస్‌లో గత చిత్రాలను రాకేషే స్వయంగా నిర్మించాడు.

కానీ ‘క్రిష్-4’ను సొంతంగా ప్రొడ్యూస్ చేసే పరిస్థితి లేనట్లుంది. రాకేష్ చెబుతున్నదాన్ని బట్టి చూస్తే ఈ సినిమాకు ఓ 500 కోట్లకు పైగా పెట్టాలేమో. హృతిక్‌కు ఉన్న క్రేజ్, మార్కెట్.. ‘క్రిష్-4’ అనగానే వచ్చే హైప్ అన్నింటినీ బట్టి చూస్తే ఐదారొందల కోట్ల బడ్జెట్ వరకు ఓకే అనుకోవచ్చు. మరీ అన్ని కోట్లంటే నిర్మాతలు వెనుకంజ వేస్తుండొచ్చు. కానీ రాజీ పడి సినిమా తీస్తే ప్రయోజనం లేదని.. అనుకున్న బడ్జెట్లో తీస్తేనే ఔట్ పుట్ బాగుంటుందని రాకేష్ అంటున్నాడు. మరి ఆయనకు అండగా నిలిచే నిర్మాత ఎవరో?