తమిళనాట సినిమాలతో పాటు సినిమాయేతర విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే అమ్మాయి వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయురాలైన ఈ భామ.. మొదట్లో కథానాయికగా నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఆ సమయంలోనే విశాల్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా ఈమె వార్తల్లో నిలిచింది.
వివాదాస్పద అంశాలపై చాలా బోల్డ్‌గా మాట్లాడే అలవాటున్న వరలక్ష్మి ఒక సమయంలో విశాల్‌తో సన్నిహితంగానే మెలిగింది. అతడిని పెళ్లాడబోతున్నట్లే కనిపించింది. కానీ తర్వాత అతడికి దూరమైంది. సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. కథానాయిక పాత్రలు కలిసి రాకపోవడంతో ఆమె విలన్, క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లింది. అవి బాగానే వర్కవుటయ్యాయి. విజయ్ నటించిన సర్కార్ లాంటి భారీ చిత్రంలో ఆమె విలన్ పాత్ర పోషించడం విశేషం.
తెలుగులో కూడా తెనాలి రామకృష్ణ సహా కొన్ని సినిమాల్లో నటించిన వరలక్ష్మి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ఆమె దర్శకురాలిగా మారింది. కన్నామూచ్చి (దాగుడుమూతలు అని అర్థం) అనే టైటిల్‌తో వరలక్ష్మి దర్శకురాలిగా అరంగేట్రం చేయనుంది. ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. పోస్టర్ చూస్తే ఇదో థ్రిల్లర్ తరహా సినిమా అనిపిస్తోంది. ఈ చిత్ర ప్రి లుక్ పోస్టర్‌ను మన మంచు లక్ష్మీప్రసన్న లాంచ్ చేయడం విశేషం.
తమిళంలో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ అయిన తెండ్రాల్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించనుంది. సామ్ సీఎస్ సంగీతం సమకూర్చనున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలు పోషించనున్న నటీనటులెవరన్నది వెల్లడి కాలేదు. వరలక్ష్మి ఇలా దర్శకురాలిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. మరి కొత్త అవతారంలో ఆమె ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates