హాస్య బ్రహ్మ… ఇన్‌స్టా ఆగమనం

తెలుగు సినిమా చరిత్రలోనే బ్రహ్మానందాన్ని మించిన కమెడియన్ ఉండరంటే ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయనలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ మరొకరు కనిపించరు. గత కొన్నేళ్లలో బ్రహ్మి సినిమాలు తగ్గించినా సరే.. సోషల్ మీడియాలో ఆయన మీద వచ్చే కంటెంట్‌తో రోజూ తెలుగు వాళ్ల ముఖాల్లో చిరునవ్వులు పూస్తూనే ఉంటాయి.

60 ఏళ్ల వృద్ధులను.. 20 ఏళ్ల యువతను ఒకేలా ఎంటర్టైన్ చేసి.. అందరిలోనూ క్రేజ్ సంపాదించుకున్న అరుదైన కమెడియన్ ఆయన. ఈ తరం యువత సోషల్ మీడియాలో బ్రహ్మి పేరు చెబితే ఊగిపోతారు. బ్రహ్మి లేని తెలుగు మీమ్ కంటెంట్‌ను ఊహించలేని పరిస్థితి. సోషల్ మీడియాలో ఇంత ఫాలోయింగ్ ఉన్న కమెడియన్ దేశంలో మరొకరు లేదంటే అతిశయోక్తి కాదు. ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఉంటే ఫ్యాన్స్‌కి మరింత కిక్కు ఉంటుంది కదా.

బ్రహ్మి తన అభిమానులను అలరించడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టేశారు. Yourbrahmanandam ఐడీతో ఆయన ఇన్‌స్టాలోకి వచ్చారు. తన కొడుకు గౌతమ్‌తో కలిసి నటించిన ‘బ్రహ్మానందం’కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మీరు సోషల్ మీడియాలో ఉన్నారా.. ఐడీ చెబితే బ్రేక్ ఇస్తాం అంటూ అభిమానులు బ్రహ్మిని అడగ్గా.. తన ఇన్‌స్టా ఐడీని ఆయన పంచుకున్నారు.

తాను రాసిన పుస్తకం పేరు ‘ఇట్లు మీ బ్రహ్మానందం’ అని.. దాని ఇంగ్లిష్ రూపం అయిన ‘Yourbrahmanandam’ ఐడీతోనే తాను ఇన్‌స్టాలోకి వచ్చానని బ్రహ్మి తెలిపారు. ఆయన ఇన్‌స్టాలోకి రాగానే పెద్ద ఎత్తున అభిమానులు ఆయన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. మరి ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటూ తన మీద వచ్చే మీమ్స్ వరదను గమనించి స్పందిస్తారేమో చూడాలి మీమ్ గాడ్‌గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం.