మదగజరాజ ఇక్కడ దొరికిపోయాడు

పన్నెండు సంవత్సరాల తర్వాత విడుదలైనా తమిళంలో ఊహించని వసూళ్లతో అరవై కోట్లకు పైగా తెచ్చిన మదగజరాజ పద్దెనిమిది రోజుల తర్వాత తెలుగు డబ్బింగ్ వెర్షన్ నిన్న రిలీజ్ చేశారు. ఇక్కడా అదే స్పందన వస్తుందనే నమ్మకంతో నిర్మాతలు ఎదురు చూశారు కానీ మదగజరాజ ఇక్కడ దొరికిపోయాడు.

నిన్న ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. వరలక్ష్మి శరత్ కుమార్, అంజలిలు ప్రమోషన్లలో పాల్గొన్నప్పటికీ విశాల్ దూరంగా ఉన్నాడు. ఆరోగ్య కారణమో మరింకేదైనానో చెప్పలేం కానీ మొత్తానికి బజ్ తెచ్చుకోవడంలో రాజా ఫెయిలయ్యాడు. రొటీన్ కంటెంట్ కావడంతో టాక్ అంతంతమాత్రంగానే ఉంది.

తమిళంలో అంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం లేకపోలేదు. పొంగల్ పండక్కు వేరే పెద్ద హీరో సినిమా ఏదీ లేకపోవడంతో ఎంత రొటీన్ ఉన్నా సరే మదగజరాజాని అక్కడి ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. వరస సెలవులు, విజయ్ ఆంటోనీ కంపోజ్ చేసిన పాటలు దీనికి దోహదం చేశాయి.

కానీ తెలుగులో ఈ ఫార్ములా వర్కౌట్ కాలేదు. ఫేడ్ అవుట్ అయిన రొటీన్ కాన్సెప్ట్ ని టికెట్లు కొని థియేటర్లలో చూసేందుకు టాలీవుడ్ జనాలు అంతగా ఆసక్తి చూపించలేదు. సంతానం వన్ లైనర్స్ కామెడీ నవ్వించినప్పటికీ మొత్తాన్ని నిలబెట్టేందుకు అతనొక్కడే సరిపోలేదు. దీంతో ఇక్కడ హిట్టు ఆశలు లేనట్టే.

నిజానికి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత జనవరిలో కాస్త చెప్పుకోదగ్గ సినిమాగా మదగజరాజనే నిలిచింది కానీ హైప్ తెచ్చుకోవడంలో విఫలం కావడం ప్రభావం చూపిస్తోంది. మణివణ్ణన్, మనోబాల లాంటి దివంగత ఆర్టిస్టులు ఉండటం వాళ్లకు కనెక్ట్ అవుతుందేమో కానీ మనకు మాత్రం అవుట్ డేటెడ్ ఫీలింగ్ ఇస్తుంది.

కమర్షియల్ మసాలాలు దిట్టంగా వేసినా వాటిలో వాసన మరీ పాతదిగా ఉండటంతో రుచి లేకుండా పోయింది. అందుకే సినిమాలకు రిలీజ్ టైమింగ్ చాలా ముఖ్యమని చెప్పేది. ఒకవేళ ఇదే మదగజరాజ వేరే సీజన్ లో వచ్చి ఖచ్చితంగా ఇంత ఫలితం వచ్చి ఉండేది కాదనేది వాస్తవం.