కరోనాతో గేమ్స్… టాలీవుడ్‍కి షాక్‍

సకల జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ చేస్తామని చెప్పిన తెలుగు సినిమా నిర్మాతలు ఏవో అరకొర ఏర్పాట్లు మాత్రమే చేసి షూటింగులు కానిచ్చేస్తున్నారు. దీంతో కరోనా వైరస్‍ తెలుగు సినిమా షూటింగ్‍ స్పాట్స్లో హల్‍చల్‍ చేస్తోంది.

టక్‍ జగదీష్‍ చిత్ర బృందంలో పలువురు కరోనా వైరస్‍ బారిన పడడంతో షూటింగ్‍ నిలిపి వేసారు. పది రోజుల క్రితం మొదలైన ఈ చిత్రం షూటింగ్‍ స్పాట్లో పని చేస్తోన్న వారిలో పలువురికి కరోనా సోకింది. యూనిట్‍లోని ఒక ముఖ్య సభ్యుడికి కూడా కరోనా రావడంతో షూటింగ్‍కి బ్రేక్‍ ఇచ్చేసారు.

మీడియం బడ్జెట్‍ సినిమాల షూటింగ్‍ ఎలా జరుగుతుందనే దానిని బట్టి పెద్ద సినిమాలు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ కరోనాని కట్టడి చేయడం అంత సులభం కాదనేది తేలడంతో నవంబరు నుంచి పెట్టుకుందామని అనుకున్న షూటింగులు కాన్సిల్‍ చేసేసారు.

టక్‍ జగదీష్‍ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనేది తెలియదు. కరోనా సోకిన వారిని మినహాయించి మిగతా వాళ్లతో షూటింగ్‍ చేయడానికి కూడా భయపడుతున్నారు. వాళ్లను తప్పించినా కానీ మరికొందరు దీని బారిన పడే అవకాశమయితే లేకపోలేదు. దీంతో చిత్ర పరిశ్రమ ఇప్పట్లో పూర్వ స్థితికి రాదనేది స్పష్టమైపోయింది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)