రాజకీయ ప్రవేశం చేశాక తన చివరి సినిమాగా విజయ్ చేస్తున్న తలపతి 69కి ‘జన నాయగన్’ టైటిల్ ని ఖరారు చేస్తూ ఇవాళ ఫస్ట్ లుక్ వదిలారు. లక్షలాది జన సమూహం చూస్తుండగా వాళ్ళతో సెల్ఫీ తీసుకుంటున్న హీరో స్టిల్ ద్వారా కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పే ప్రయత్నం చేశారు.
తమిళనాడులోనే కాక బయట రాష్ట్రాల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న విజయ్ లాస్ట్ మూవీగా దీని మీద మాములు అంచనాలు లేవు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు ఒక కీలక పాత్ర చేస్తోంది. అసలు మ్యాటర్ ఇది కాదు. ముందు నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ఉంది.
కానీ ఇప్పుడు పోస్టర్ చూశాక ఇది వేరేనేమో అనే సందేహం కలుగుతోంది. అయితే అంత తేలిగ్గా రీమేక్ కాదని వెంటనే తేల్చలేం. ఎందుకంటే దర్శకుడు హెచ్ వినోత్ మార్పులు చేయడంలో చాలా నేర్పరి. బాలీవుడ్ పింక్ ని అజిత్ ఇమేజ్ కి తగ్గట్టు కమర్షియల్ కోటింగ్ ఇచ్చి నెర్కొండ పార్వైగా మలచిన తీరు పెద్ద సక్సెస్ ఇచ్చింది.
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టైంలో దీన్ని రిఫరెన్స్ గా తీసుకున్నారు కానీ పింక్ ని కాదు. సో జన నాయగన్ ఇప్పటికిప్పుడు ఏ కథనేది కనీసం టీజర్ వస్తే కానీ చెప్పలేం. ముప్పాతిక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు.
ఇతర భాషల్లో డబ్బింగ్ హక్కుల కోసం జన నాయగన్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకవేళ ఇది రీమేక్ అయినా కాకపోయినా చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2026 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారనే టాక్ చెన్నై వర్గాల్లో ఉంది. ఇప్పటిదాకా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీ తప్ప ఎవరూ ఆ సీజన్ ని అధికారికంగా లాక్ చేసుకోలేదు.
సో జన నాయగన్ కనక ఓకే చేసుకుంటే వసూళ్ల పరంగా భారీ రికార్డులు నమోదవుతాయి. కానీ ఈ ఏడాది దసరా లేదా దీపావళికి విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జరుగుతోందట. చూడాలి మరి చివరికి జన నాయకుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో.