సినిమా కోసం ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినా పైసా ఖర్చు లేకుండా మార్కెటింగ్ చేసుకోవడంలో రాజమౌళిని మించిన వారు లేరేమో. చిన్న ఫోటో లాంటి వీడియోతో ఒక రాత్రి మొత్తాన్ని సోషల్ మీడియా కంట్రోల్ లోకి తీసుకురావడం ఆయనకే చెల్లింది. నిన్న అందరూ పడుకున్న తర్వాత మహేష్ బాబు పాస్ పోర్ట్ తీసేసుకుని షూటింగ్ మొదలుపెడుతున్నట్టు ఆయన పెట్టిన్స్ సింహం ఫోటో క్షణాల్లో మీమ్స్ కు దారి తీసింది.
అన్నీ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ ఒకదాన్ని మించి మరొకటి నవ్వులు కురిపించేలా వైరలవుతున్నాయి. ఇక వాట్స్ అప్ తదితర మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు.
జులాయిలో అలీ బ్రహ్మానందం మధ్య జరిగే పేపర్ సీన్, ఒక్కడులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఎపిసోడ్, డార్లింగ్ లో ప్రభాస్ ఫ్రెండ్స్ కామెడీ, మహర్షి, లియో, నమో వెంకటేశ, రచ్చ, సూపర్ లో అలీ వేసే బొమ్మ సన్నివేశం ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే వందల సినిమాల రెఫెరెన్సులు మీమ్స్ లో వాడటం చూస్తుంటే అభిమానుల క్రియేటివిటీకి ముచ్చట వేయక మానదు.
ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ వీటిని మాములుగా ఎంజాయ్ చేయడం లేదు. ఇకపై ఫారిన్ ట్రిప్పులు లేకుండా పూర్తిగా ఎస్ఎస్ఎంబి సెట్లోనే తమ హీరో ఉంటాడని, తద్వారా త్వరగా షూటింగ్ అయిపోతుందనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే ఎస్ఎస్ఎంబి 29 ఈ రేంజ్ లో ట్రెండింగ్ కావడం చూస్తుంటే ఫస్ట్ లుక్ లేదా టీజర్ కు ఏకంగా సర్వర్లు క్రాష్ అవుతాయేమో. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇది రెండు మూడేళ్లు నిర్మాణంలో ఉండదని ఇన్ సైడ్ టాక్.
మొదటి భాగాన్ని ఏడాదిన్నర లోపే సిద్ధం చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నారట. ప్రియాంకా చోప్రా హీరోయినా లేక ఇంకేదైనా ట్విస్టు ఉందానేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యాయని వినికిడి. ఆస్కార్ గెలిచిన టీమ్ కాబట్టి సంగీతం మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.