ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘గేమ్ చేంజర్’ మూవీ.. రిలీజై ఒక్క రోజు తిరక్కముందే ఆన్ లైన్లోకి వచ్చేయడం తెలిసిందే. క్వాలిటీ ప్రింట్ బయటికి రావడంతో ఇటు ‘గేమ్ చేంజర్స్’ మేకర్స్‌కు, అటు మెగా అభిమానులకు ఆందోళన తప్పలేదు. పైరసీ ప్రింట్ ఆన్ లైన్లో రిలీజ్ కాకుండా ఉండాలంటే ఐదు కోట్లు డబ్బులు ఇవ్వాలంటూ కొందరు నిర్మాత దిల్ రాజును బెదిరించినట్లు కూడా ఇటీవల వెల్లడైంది.
పైరసీ ప్రింట్ విషయమై కొందరు నిందితులను గుర్తించి ఇటీవల కేసులు కూడా పెట్టారు. పైరసీ లింక్స్‌ను ఆన్ లైన్ నుంచి తీయించడానికి గట్టి ప్రయత్నమే జరిగినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఐతే ఇప్పుడు మళ్లీ ‘గేమ్ చేంజర్’ మరోసారి పైరసీ బారిన పడింది. తమిళంలో మరియు హిందీ లో ఈ సినిమాకు సంబంధించి మరింత క్వాలిటీ ప్రింట్ ఆన్ లైన్లోకి వచ్చింది. ఓటీటీలో సినిమా రిలీజ్ చేస్తే ఎంత క్వాలిటీ ఉంటుందో.. అలాంటి నాణ్యత కనిపిస్తోందట లేెటెస్ట్‌గా ఆన్ లైన్లోకి వచ్చి ప్రింట్‌లో.
ఈ వెర్షన్ సినిమా ఎడిట్ రూం నుంచే లీక్ అయినట్లు వార్తలు వస్తుండడం గమనార్హం. ఇందుకు సంబంధించి నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రూఫ్స్ కూడా పెడుతున్నారు. ఈ సినిమా ఎడిట్ దశలో ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిగా జరగని వెర్షన్‌ను ప్రస్తుతం ఆన్ లైన్లో లీక్ చేసినట్లు తెలుస్తోంది. అనేక సన్నివేశాల్లో సీజీ పూర్తి కాని.. డబ్బింగ్ సరిగా జరగని సీన్లు ఈ వెర్షన్లో ఉన్నాయి. దీన్ని బట్టి తమిళ వెర్షన్ కానీ, హిందీ వెర్షన్ ఎడిటింగ్ జరిగిన చోటి నుంచి ఎవరో ఈ సినిమాను లీక్ చేశారన్నది స్పష్టం.
ఇలా చిత్ర బృందంలో పని చేసిన వాళ్లే సినిమాను లీక్ చేయడం అంటే అంత కంటే దారుణమైన విషయం మరొకటి ఉండదు. గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. విడుదలకు ముందే టీంలోని ఓ వ్యక్తి సగం సినిమాను లీక్ చేసేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత కూడా ఇలాంటి దారుణాలు మరికొన్ని జరిగాయి.