శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా 800 పేరుతో ఓ సినిమాను ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిని మురళీధరన్ పాత్ర కోసం ఎంచుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా చేస్తున్న చోటే తిరస్కారం ఎదురైంది.
శ్రీలంకలో తమిళులపై జరిగిన దారుణాలకు కారణమైన అక్కడి ప్రభుత్వానికి మద్దతుదారు అయిన, స్వతహాగా తమిళుడై ఉండి వారికి జరిగిన అన్యాయంపై ఎప్పుడూ గళం విప్పని మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించడాన్నివాళ్లు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాకు రాజకీయాలతో సంబంధం లేదని వివరణ ఇచ్చినప్పటికీ వివాదం సద్దుమణగలేదు.
ఐతే ఇప్పుడీ వివాదం కొత్త మలుపు తీసుకుంది. విజయ్ సేతుపతికి మద్దతుగా సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌తో పాటు కొందరు సెలబ్రెటీలు గళం విప్పారు. ఒక నటుడిగా సేతుపతి ఏ పాత్ర అయినా చేయొచ్చని.. అతణ్ని ఎలా అడ్డుకుంటారని, ఈ సినిమాను క్రికెట్ కోణంలోనే చూడాలని ఆమె అంది.
అంతటితో ఆగకుండా మురళీధరన్ ఐపీఎల్‌లో కోచ్‌గా పని చేస్తున్నది సన్‌రైజర్స్ జట్టుకుని.. దాన్ని నడిపిస్తున్నది సన్ టీవీ యాజమాన్యం అని.. మరి ఇన్నేళ్లుగా వాళ్ల మీద మీ వ్యతిరేకత చూపించలేదేంటి అని ఆమె ప్రశ్నించారు. దీనికి చాలామంది వంత పాడారు. దీంతో సేతుపతి దగ్గర మొదలైన వివాదం కాస్తా సన్ టీవీ వైపు మళ్లింది. దాని అధినేతలు డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి కుటుంబ సభ్యులే కావడంతో డీఎంకే పార్టీకి ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది.మొత్తంగా చూస్తే త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉన్న తమిళనాడులో 800 సినిమా వివాదం రాజకీయంగా దుమారానికే కారణమయ్యేలా ఉంది.