హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు పూర్తి చేసుకుని మరో బ్లాస్టింగ్ మూవీ కోసం రెడీ అవుతున్న బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కొన్ని వారాల క్రితం అఖండ 2కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో మొట్టమొదటి సీక్వెల్ గా దీని మీద మామూలు అంచనాలు లేవు.
ఇటీవలే డాకూ సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ ఇంటర్వెల్ కే మీ టికెట్ డబ్బులకు న్యాయం జరుగుతుందని చెప్పడం చూస్తే కంటెంట్ ఏ రేంజ్ లో డిజైన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్లి మరీ కొన్ని సీన్లు షూట్ చేసుకు రావడం బట్టి అఘోరా విశ్వరూపం పదింతలు ఎక్కువ ఉంటుందని అనిపిస్తోంది.
తాజాగా అఖండ 2లో ఒక అనూహ్యమైన మార్పు జరిగినట్టు సమాచారం. హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని లాక్ చేశారని తెలిసింది. ముందైతే ప్రగ్య జైస్వాల్ నే అనుకున్నారు. ఓపెనింగ్ పూజ కి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు తన స్థానంలో సంయుక్తని తీసుకొచ్చారని ఫిలిం నగర్ టాక్.
కథ ప్రకారమైతే చిన్న బాలయ్య భార్యగా ప్రగ్యకు మొదటి భాగంలో బాగానే ప్రాధాన్యం దక్కింది. వీళ్ళ కూతురిని కాపాడే బాధ్యతే అఘోరాగా పెద్ద బాలయ్య తీసుకుంటాడు. ఇక్కడ అఖండ 1 ముగిసింది. రెండో భాగంలో ఆ పాప పెద్దయ్యాక ఏర్పడ్డ ప్రమాదాలను ఎలా కాచుకుంటారనే దాని మీద రెండో పార్ట్ ని సిద్ధం చేశారని ఆల్రెడీ ఒక లీక్ ఉంది.
సో సంయుక్త పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్. కారణం ఏదైనా ఈ అమ్మాయికిది పెద్ద ఆఫరని చెప్పాలి. సీనియర్ హీరోలతో ఇప్పటిదాకా తను జట్టు కట్టలేదు. సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, నిఖిల్, ధనుష్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లతో కలిసి నటించింది. కానీ నిన్నటి జనరేషన్ స్టార్లతో మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది.
క్యారెక్టర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. సెప్టెంబర్ 25 విడుదల తేదీ లాక్ చేసుకున్న అఖండ 2 తాండవంని ఆ డేట్ కే రిలీజ్ చేసేందుకు టీమ్ పక్కా ప్లానింగ్ తో ఉంది. ఏదైనా పరిస్థితుల ప్రభావం వల్ల మార్పులు జరిగితే చెప్పలేం కానీ లేదంటే దసరా పండక్కు బాలయ్య మాస్ చూడొచ్చు.