2025 తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం పది రోజులకే 230 కోట్ల గ్రాస్ దాటేసి విజయవంతంగా దూసుకుపోవడం పట్ల వెంకీ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్ వద్ద పోటీ లేదు కాబట్టి నెలాఖరు దాకా ఈ ర్యాంపేజ్ ఇలాగే కొనసాగుతుందనే నమ్మకంతో ఉన్నారు.
పండక్కు తీవ్రమైన పోటీలోనూ ఫ్యామిలీ కంటెంట్ తో ఇంత భారీ వసూళ్లు సాధించడం అనూహ్యమనే చెప్పాలి. ఊహించిన దాని కన్నా గొప్ప సక్సెస్ సాధించిందీ సినిమా. ఇదిలా ఉండగా దర్శకుడు అనిల్ రావిపూడి దీని ప్రమోషన్లలో పంచుకుంటున్న విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
జైలర్ విడుదలయ్యాక మహేష్ బాబు, అనిల్ రావిపూడి మధ్య సంభాషణ జరిగింది. ఇలాంటి జానర్ ఎందుకు ట్రై చేయకూడదనే ప్రస్తావన ఇద్దరి మధ్య వచ్చింది. ప్రస్తుతం తెలుగులో వినోదాన్ని మీ అంత బాగా ఎవరూ డీల్ చేయడం లేదని, దానికి జైలర్ తరహాలో క్రైమ్ టచ్ ఇస్తే కొత్తగా ఉంటుందని మహేష్ చెప్పడం అనిల్ ని సీరియస్ ఆలోచనలో పడేసింది.
నిజమే కదా అనుకుని ఒక కిడ్నాప్ డ్రామాకు ఒక హీరో, ఇద్దరు భామల ఫార్ములాను రాసుకుని కొత్త ప్రయోగం చేశాడు రావిపూడి. కామెడీ మిస్ కాకుండా కమర్షియల్ అంశాలు బ్యాలన్స్ చేస్తూనే వండిన సంక్రాంతికి వస్తున్నాం క్లాసు మాసు తేడా లేకుండా అందరినీ మెప్పించేసింది.
సరిలేరు నీకెవ్వరుతో ఈ కాంబో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఇంకో సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఈలోగా మహేష్ రాజమౌళికి కమిట్ కావడంతో సమీకరణాలు మారిపోయాయి. అయినా ఇద్దరి ఫ్రెండ్ షిప్ అలాగే కొనసాగుతోంది.
ఎస్ఎస్ఎంబి 29 పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ స్నేహితుడి ఆనందంలో భాగం పంచుకోవాలనే ఉద్దేశంతో మహేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం పార్టీ టీమ్ తో జత కలిశాడు. నచ్చే సినిమాల గురించి క్రమం తప్పకుండా ఎక్స్ సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహించే మహేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం వెనుక ఉన్నాడంటే స్పెషల్ న్యూసే.