‘రేపటి తీర్పు’గా మారనున్న ‘భగవంత్ కేసరి’?

నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ 69వ చిత్రంగా తెరకెక్కుతున్నది నిజంగా బాలయ్య మూవీ రీమేకా అనే విషయంలో రెండు వారాల ముందు వరకు కొంత సందేహాలుండేవి కానీ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తమిళ నటుడు వీటీవీ గణేష్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విజయ్.. చివరగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

ఈ ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ అతి త్వరలో లాంచ్ కాబోతున్నాయి. ఐతే ఈ లోపే టైటిల్ గురించి అనధికార సమాచారం బయటికి వచ్చేసింది. ఈ చిత్రానికి ‘నాలయ తీర్పు’ అనే టైటిల్ ఖాయం చేసినట్టు వార్త చక్కర్లు కొడుతుంది. అంటే తెలుగులో.. రేపటి తీర్పు అని అర్థం. తెలుగులో ‘భగవంత్ కేసరి’ అనే మాస్ టైటిల్ పెడితే.. తమిళంలో మాత్రం ‘రేపటి తీర్పు’ అంటూ క్లాస్ టచ్ ఉన్న పేరు పెట్టడం విశేషమే.

ఐతే ఈ టైటిల్ వెనుక ఒక ఆసక్తికర నేపథ్యం ఉంది. విజయ్ హీరోగా నటించిన తొలి చిత్రం పేరు.. ‘రేపటి తీర్పు’నే కావడం విశేషం. 18 ఏళ్ల చిన్న వయసులో తన తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతోనే విజయ్ హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా హిట్టయింది. తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన విజయ్.. గత కొన్నేళ్లలో తమిళంలో రజినీకాంత్‌ను మించిన స్టార్‌గా అవతరించాడు. ప్రస్తుతం కోలీవుడ్లో నంబర్ వన్ హీరోగా ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించబోతున్నాడు.

పవన్ కళ్యాణ్ లాగా మళ్లీ భవిష్యత్తులో సినిమాల్లోకి పునరాగమనం చేస్తాడో లేదో కానీ.. ప్రస్తుతానికైతే ‘భగవంత్ కేసరి’ రీమేకే ఆయన చివరి చిత్రం కానుంది. తన తొలి సినిమా టైటిల్‌నే దీనికి పెట్టడం ద్వారా అభిమానులకు ఈ చిత్రంతో మరింత ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడేలా చేస్తున్నాడు విజయ్.

శతురంగ వేట్టై, నీర్కొండ పార్వై, వలిమై, తునివు చిత్రాలను రూపొందించిన హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. మామిత బైజు తెలుగులో శ్రీలీల చేసిన పాత్రలో కనిపించనుంది.