రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి, ఫలితాలు తేలిపోయాయి కాబట్టి మూవీ లవర్స్ ఫ్రెష్ గా రిలీజయ్యే వాటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చెప్పుకోవడానికి అరడజను పైనే ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కనీస సందడి కనిపించడం లేదు.
సుకుమార్ కూతురు సుకృతి తెరకు పరిచయమవుతున్న ‘గాంధీ తాత చెట్టు’కి మైత్రి డిస్ట్రిబ్యూషన్ అండదండలు దొరికినప్పటికీ బజ్ కనిపించడం లేదు. అనూహ్యంగా టాక్ వస్తే తప్ప ఓపెనింగ్స్ ని ఆశించలేం. వైఎస్ వివేకా మర్డర్ ఆధారంగా తీసిన ‘హత్య’ను థియేటర్లకు తీసుకొస్తున్నారు. పేరున్న క్యాస్టింగ్ వల్ల కాస్త ఆడియన్స్ దృష్టిలో ఉంది.
టోవినో థామస్, త్రిషల మలయాళ డబ్బింగ్ ‘ఐడెంటిటీ’ బరిలో నిలిచింది. ఒరిజినల్ వెర్షన్ కు డీసెంట్ టాక్ వచ్చింది కనక ఇక్కడ వర్కవుటవుతుందనే నమ్మకంతో నిర్మాతలున్నాయి. ప్రేమలు సెన్సేషన్ మమిత బైజు ‘డియర్ కృష్ణ’కు ప్రమోషన్లు చేశారు కానీ జనాలు లైట్ తీసుకున్న వైనం బుకింగ్స్ లో స్పష్టం. కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ గానే అనిపిస్తోంది.
మరో చిన్న సినిమా ‘తల్లిమనసు’లో ఆర్టిస్టులు ఎవరో కూడా పబ్లిక్ కి రిజిస్టర్ కాలేదు. విదేశాల్లో విజయం సాధించిన ‘హాంగ్ కాంగ్ వారియర్స్’కు పబ్లిసిటీ జోరుగానే జరిగింది. అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’ కేవలం హిందీలో మాత్రమే విడుదలవుతోంది.
కౌంట్ ఎన్ని ఉన్నా చివరిది తప్పించి మిగిలిన వాటి అడ్వాన్స్ బుకింగ్స్ నీరసంగా ఉన్నాయి. తిరిగి వీకెండ్ లో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ మళ్ళీ పికప్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో టికెట్ రేట్లు సాధారణ స్థితికి వచ్చాయి కాబట్టి వసూళ్లు మరింత పెరుగుతాయని ట్రేడ్ నమ్మకం.
ఫిబ్రవరి 7 తండేల్ వచ్చేదాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు వచ్చేలా కనిపించడం లేదు. ఒకవేళ పైన చెప్పిన వాటికి ఏదైనా సర్ప్రైజింగ్ టాక్ వస్తే ఓకే కానీ లేదంటే అధిక శాతం థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చేలా ఉన్నాయి. అయినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం చిన్న సినిమాలకు పెద్ద సవాలే.