మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు విజయం దక్కి కూడా చాలా ఏళ్లయిపోయింది. గని, గాండీవధారి అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా.. ఇలా సోలో హీరోగా తన చివరి సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లవడంతో తన మార్కెట్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా ‘మట్కా’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్స్ లేవు.
పెట్టుబడిలో ఐదో వంతు కూడా థియేటర్ల నుంచి వెనక్కి తేలేకపోయిందీ చిత్రం. దీంతో వరుణ్ కొత్త ప్రాజెక్టుల మీద ప్రభావం పడే పరిస్థితి వచ్చింది. అతను హీరోగా యువి క్రియేషన్స్ సంస్థలో మేర్లపాక గాంధీ తెరకెక్కించాల్సిన చిత్రం ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ యువి సంస్థ ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించింది. తాజాగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు కూడా.
వరుసగా సీరియస్ సినిమాలు చేసి ఎదురు దెబ్బలు తిన్న వరుణ్ తేజ్.. ఈసారి కామెడీ ట్రై చేయబోతున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల్లో చక్కటి వినోదం అందించిన మేర్లపాక గాంధీ.. అదే స్టయిల్లో వరుణ్ సినిమాను రూపొందించబోతున్నాడు. వీరి కలయికలో రానున్న సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. దీనికి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో క్రిష్ కుటుంబ సంస్థ అయిన ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ కూడా భాగస్వామి కానుంది. తొలి రెండు చిత్రాలతో ప్రామిసింగ్‌గా కనిపించిన మేర్లపాక గాంధీ కూడా తర్వాత కృష్ణార్జున యుద్ధం, లైక్ సబ్‌స్క్రైబ్ షేర్ చిత్రాలతో తీవ్రంగా నిరాశపరిచాడు. ‘కొరియన్ కనకరాజు’ ఇటు వరుణ్, అటు గాంధీ కెరీర్లకు అత్యంత కీలకంగా మారనుంది.
ఇది బాాగా ఆడితే వీళ్ల కెరీర్లు గాడిన పడతాయి. లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పవు. ‘పక్కా కమర్షియ్’, ‘కంగువా’ చిత్రాలతో గట్టి ఎదురు దెబ్బ తిన్న యువి సంస్థకు కూడా ఈ చిత్రం విజయవంతం కావడం చాలా అవసరం.