ఇండస్ట్రీలో పెరిగిన కేసులతో హీరోలకు గుబులు

దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటిస్తోన్న కరోనా కేసుల సంఖ్య చూస్తే నిజంగా కరోనా తగ్గిపోయిందేమోననే భావన కలుగుతుంది. కానీ నిజానికి కరోనా కేసులను రిపోర్ట్ చేయడం మానేసారంతే. ఇంకా దానికి విరుగుడు రాలేదు. అలాగే జనం దాని బారిన పడడం ఆగలేదు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికే వస్తే షూటింగ్‍ మొదలైన పలు యూనిట్లలో పలువురికి కరోనా సోకిందట. వారానికోసారి టెస్టులు చేసుకుంటూ ఎవరికి కరోనా వస్తే వారిని ఇంటికి పంపించేసి మిగతా వాళ్లతో షూటింగ్‍ చేస్తున్నారట. అయితే దీని గురించి మీడియాలో రాకుండా చూసుకుంటున్నారట. కానీ ఇండస్ట్రీలో అయితే పరిస్థితి ఏమిటనేది అందరికీ తెలుసు.

ధైర్యంగా వున్న కొందరు యువ హీరోలు మినహాయించి పెద్ద స్టార్లు, ముఖ్యంగా సీనియర్లు మాత్రం కోవిడ్‍కి భయపడుతున్నారు. నవంబరు నుంచి షూటింగ్‍ చేద్దామని అనుకున్న వాళ్లు కూడా మరికొన్నాళ్ల పాటు షూటింగ్‍ వాయిదా వేసుకుంటున్నారు. చిరంజీవి ఆచార్య, వెంకటేష్‍ నారప్ప షూటింగ్‍ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం వుందంటున్నారు. అలాగే మరో సీనియర్‍ స్టార్‍ బాలకృష్ణ కూడా బోయపాటితో చేస్తోన్న సినిమా షూటింగ్‍ మొదలు పెట్టడానికి సుముఖంగా లేరు.