శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు. నిర్మాతలు లెక్కలు వేసుకోకుండా ఎంతైనా ఖర్చు పెట్టేసేవాళ్లు. కానీ గత దశాబ్ద కాలంలో అంతా మారిపోయింది. శంకర్ సినిమాల్లో ఒకప్పటి భారీతనం మాత్రమే మిగిలింది. కంటెంట్ మాత్రం ఎక్కడికో పోయింది. ఒకప్పుడు శంకర్ ఎంత ఖర్చు పెట్టినా అది వర్త్ అనిపించేది. ఖర్చుకు తగ్గ అనుభూతి తెరపై కనిపించేది. కానీ ఇప్పుడు అంతా వృథా అనిపిస్తోంది.
గేమ్ చేంజర్ సినిమాలో కేవలం పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఘనంగా చెప్పుకుంది చిత్ర బృందం. తీరా సినిమా చూస్తే ఆ ఖర్చంతా వేస్ట్ అనిపించింది. పాటల కోసం పెట్టిన డబ్బుతో ఒక మంచి సినిమా తీసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గేమ్ చేంజర్ అనే కాదు.. ఇండియన్-2, ఐ లాంటి సినిమాల్లో భారీతనం పేరుతో అనవసర హడావుడి తప్ప సరైన కంటెంట్ కనిపించలేదు.
ఐతే ఒకప్పటి విజయాల వల్ల, శంకర్‌కు ఉన్న స్టేచర్ వల్ల నిర్మాతలు ఆయన చెప్పిందల్లా చేస్తూ వచ్చారు. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. లైకా ప్రొడక్షన్స్ అధినేతలతో పాటు అన్నీ ఒక లెక్క ప్రకారం చేసే దిల్ రాజు సైతం అయిన కాడికి బడ్జెట్లు పెట్టి గట్టి ఎదురు దెబ్బలు తిన్నారు. ఇకపై శంకర్‌ను నమ్మి ఇలా మితిమీరిన బడ్జెట్లు పెట్టే నిర్మాతలు దొరక్కపోవచ్చు. ఇండియన్-2, గేమ్ చేంజర్ సినిమాలు శంకర్ పేరును బాగా దెబ్బ తీశాయి.
ఇక ఆయన బడ్జెట్ల మీద మోజును తగ్గించి కంటెంట్ మీద దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ పెద్ద బడ్జెట్లో సినిమా తీసినా.. అందులో ఖర్చు పెట్టించే ప్రతి రూపాయికీ తగ్గ ఔట్ పుట్ చూపించాల్సిన స్థితిలో ఉన్నాడు.
ఊరికే భారీతనం పేరుతో అనవసరంగా ఖర్చు పెడితే అది నిర్మాతల నెత్తిన గుదిబండ అవుతుందే తప్ప.. విషయం లేని భారీతనాన్ని చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. ముందు ఆయన కథ మీద గట్టిగా కూర్చోవాలి. కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నించాలి. ఓ సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేసుకుంటే తప్ప.. భారీతనంతో గిమ్మిక్కులు చేయాలనుకుంటే మాత్రం ఆయన ఆటలిక సాగవనే చెప్పాలి.