పుష్ప‌-2 రీలోడెడ్‌లో ఏముంది?

ఈ రోజుల్లో ఓ సినిమా విడుద‌లైన 4 రోజుల త‌ర్వాత కూడా థియేట్రిక‌ల్ ర‌న్ కొన‌సాగించ‌డం అంటే అరుదైన విష‌య‌మే. ఇన్ని రోజుల త‌ర్వాత కూడా ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం కోసం ఆ చిత్ర బృందం కొత్త స‌న్నివేశాల‌ను జోడించ‌డం అంటే విశేష‌మే.

పుష్ప: ది రూల్ విష‌యంలో ఇదే జ‌రిగింది. ఈ రోజు నుంచే పుష్ప‌-2 రీలోడెడ్ పేరుతో 20 నిమిషాల అద‌న‌పు స‌న్నివేశాల‌ను క‌లిపింది చిత్ర బృందం. ఇంత‌కీ ఆ అద‌న‌పు స‌న్నివేశాలేంటి అనే అంద‌రిలోనూ ఆస‌క్తి ఉంటుంద‌నడంలో సందేహం లేదు. ఆ విశేషాలేంటి అంటే…

పుష్ప‌-2 సినిమాలో చాలామందిని అయోమ‌యానికి గురి చేసిన స‌న్నివేశం.. ఇంట్రడ‌క్ష‌న్ ఫైట్‌. ఆ ఫైట్‌కు ముందు, త‌ర్వాత ఏం జ‌రిగింది అన్న‌ది క్లారిటీ లేదు. రీలోడెడ్ వెర్ష‌న్లో దీనికి స‌మాధానం ఇచ్చారు. ఫైట్ అయ్యాక స‌ముద్రంలో ప‌డిన పుష్ప చిన్న‌నాటి రోజుల‌ను గుర్తు తెచ్చుకుంటాడు. ఈత రాక‌పోయినా స్నేహితులు చేసిన స‌వాలు మేర‌కు త‌న‌ను వాళ్లు ఇంటి పేరుతో పిలుస్తార‌న్న ఆశ‌తో అత‌ను చెరువులో దూకి బంతిని బ‌య‌టికి తీసుకొస్తాడు.

అత‌ను జ‌పాన్ వెళ్ల‌డానికి కార‌ణం.. త‌న‌కు రావాల్సిన డ‌బ్బు అక్క‌డ స్ట్ర‌క్ అయిపోవ‌డం. అలా డ‌బ్బు చిక్కుకోవడం వెనుక షెకావ‌త్ ఉంటాడు. ఎర్ర‌చంద‌నం స‌ర‌కును శ్రీలంక నుంచి జ‌పాన్ చేర్చే స‌మ‌యంలో అత‌ను హ‌మీద్, జాలిరెడ్డిల‌ను చంపేసి.. మ‌ధ్య‌లో ఉన్న లింక్ తెంచేస్తాడు. దీంతో పుష్ప త‌న డ‌బ్బు కోసం కంటైన‌ర్‌లో జ‌పాన్‌కు వెళ్తాడు. ఈ స‌న్నివేశాల‌న్నీ రీలోడెడ్ వెర్ష‌న్లో ఉన్నాయి. దీంతో పాటు ఇంట‌ర్వెల్ ముంగిట పుష్ప‌కు చెక్ పెట్ట‌డం కోసం మంగ‌ళం శ్రీనుతో క‌లిసి షెకావ‌త్ స్కెచ్ వేసే సీన్.. సిండికేట్ త‌న చేజారే ప‌రిస్థితి వ‌చ్చిన‌పుడు పుష్ప రివ‌ర్స్ ఎటాక్ చేసే సీన్.. ఇలా ప‌లు స‌న్నివేశాల‌ను జోడించారు.

ఇక పుష్ప‌-1లో లాకెట్ సీన్‌కు పేఆఫ్ లేద‌ని ఫీలైన వాళ్ల‌కు కూడా రీలోడెడ్ వెర్ష‌న్లో స‌మాధానం దొరుకుతుంది. రోలింగ్ టైటిల్స్ ద‌గ్గ‌ర అజ‌య్ స్వ‌యంగా పుష్ప మెడ‌లో లాకెట్ వేసే సీన్ పెట్టారు. మొత్తంగా రీలోడెడ్ వెర్ష‌న్‌తో సినిమాకు ఒక ప‌రిపూర్ణ‌త వ‌చ్చింద‌ని చూసిన‌వాళ్లు చెబుతున్నారు.