డాకు మహారాజ్ చాలానే దాచి పెట్టాడు

సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది కానీ ప్రాధమికంగా వచ్చిన మిక్స్డ్ టాక్ అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే దేవర, కల్కి, సలార్ లాంటివి కూడా ఫస్ట్ డే ఇలాంటి స్పందనే తెచ్చుకుని తర్వాత బ్లాక్ బస్టర్లు మారిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. దీని సంగతలా ఉంచితే జనవరి 12 వస్తున్న డాకు మహారాజ్ మీద అంచనాలు ఎగబాకుతున్నాయి. ముందు వదలిన ట్రైలర్ లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది కానీ ఫ్యాన్స్ కోరుకున్న మాస్ బాలయ్య తక్కువయ్యాడనే కామెంట్స్ వినిపించాయి.

దానికి సమాధానం ఇవాళ రిలీజ్ ట్రైలర్ లో చెప్పేశారు. కథకు అనుగుణంగా ఉన్న కొన్ని పవర్ ఫుల్ బ్లాక్స్ తో పాటు బాలయ్య పాత్ర ఎంత వయొలెంట్ గా ఉంటుందన్న క్లూలను స్పష్టంగా చూపించారు. సో మాస్ అప్పీల్ బ్రహ్మాండంగా ఉందన్న క్లారిటీ వచ్చేసింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బాబీ డియోల్ విలనిజం, డాకు మహారాజ్ పాత్రను వర్ణించిన తీరు దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. హై కోర్టు మెమో నేపథ్యంలో తెల్లవారుఝామున షోలు ఉండే అవకాశం తగ్గిపోవడంతో ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురవుతున్నారు. ఉదయం 7 నుంచి ఏపీలో ప్రీమియర్లు ఉండబోతున్నాయి. తెలంగాణలో గేమ్ ఛేంజర్ టైమింగ్స్ ఫాలో కావొచ్చు.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ పూర్తయ్యాక బాలయ్య తమన్ కాంబోలో వస్తున్న డాకు మహారాజ్ మీద సంగీతం పరంగా కూడా భారీ హైప్ ఉంది. పండగ సెంటిమెంట్ ఈసారి కూడా కలిసి వస్తుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత దర్శకుడు బాబీ రెండేళ్లు దీని మీద పని చేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ లో బాలయ్య హీరోగా రూపొందుతున్న భారీ చిత్రమిది. ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లు కాగా పాప ఎమోషన్ కీలకమవుతుందని అంటున్నారు. బందిపోటుగా, ప్రభుత్వ అధికారిగా బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు.