టాలీవుడ్ హీరోను టెర్రరిస్టనుకున్నారట

టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి నటుడిగా ఒక స్థాయిని అందుకున్న వాళ్లలో సత్యదేవ్ ఒకడు. అతను ‘మిస్టర్ పర్ఫెక్ట్‌’ ప్రభాస్ నలుగురు స్నేహితుల్లో ఒకడిగా అంతగా గుర్తింపు లేని పాత్రతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇలాంటి నామమాత్రమైన పాత్రలు చాలానే చేశాడు.

‘అత్తారింటికి దారేది’లో సైతం పవన్ చేతిలో దెబ్బలు తినే ఒక పాత్రలో నటించాడు. అలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి ‘జ్యోతిలక్ష్మీ’తో ఛార్మికి జోడీగా నటించి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ఇలాంటి లో బడ్జెట్ సినిమాల్లోనే హీరోగా నటిస్తూ.. క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ వేస్తూ ముందుకు సాగాడు. ఈ మధ్యే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’తో హీరోగా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో అతను నటుడిగా తనకంత గుర్తింపు లేని సమయంలో ఎదురైన భయానక అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు. ఓ సినిమా షూటింగ్ కోసం ఆఫ్ఘనిస్థాన్‌ వెళ్లిన సత్యదేవ్‌ను అక్కడి పోలీసులు టెర్రరిస్టు అనుకుని కాల్చేయబోయారట. హబీబ్ అనే హిందీ సినిమా షూటింగ్ కోసం వెళ్లినపుడు ఈ చేదు అనుభవం ఎదురైనట్లు సత్యదేవ్ చెప్పాడు. ఒక బిల్డింగ్‌లో నాలుగో ఫ్లోర్లో కెమెరా పెట్టి సత్యదేవ్ రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్లే సీన్ చిత్రీకరించారట. మూణ్నాలుగు టేక్‌లు తీశాక దర్శకుడు వెళ్లి సీన్ చూసుకుంటుంటే.. సత్యదేవ్ ఫోన్ మాట్లాడుకుంటూ అనుమానాస్పదంగా ఒకే చోట మళ్లీ మళ్లీ తిరుగుతుండటం చూసి ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి వచ్చిన టెర్రరిస్టునేమో అన్న అనుమానంతో పోలీసులు చుట్టుముట్టారట.

కాస్ట్యూమ్‌లో ఉండటం వల్ల తన దగ్గర పాస్ పోర్టు కూడా లేదని.. తనతో ఉన్న వ్యక్తిని పాస్ పోర్ట్ చూపమని అడిగితే అతను కాలి సాక్సుల్లో ఉన్న పాస్ పోర్ట్ తీయడానికి కిందికి వంగితే గన్ను తీస్తున్నాడేమో అనుకుని పోలీసులు కాల్పులకు సిద్ధమైపోయారని.. అంతలో 500 మందికి పైగా జనం పోగై వాళ్లను చంపేయడంటూ అరిచారని.. ఇంతలో తాను సర్దిచెప్పబోతుండగా ఇండియన్, ఆఫ్ఘనిస్థాన్ ఎంబసీ అధికారులు రావడంతో వ్యవహారం సద్దుమణిగిందని.. అలా తాము త్రుటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నామని సత్యదేవ్ వెల్లడించాడు. ఈ ప్రాంతంలో అంతకుముందు తొమ్మిది ఆత్మాహుతి దాడులు జరగడంతోనే తమను పోలీసులు అనుమానించారని తర్వాత తెలిసిందని అతను చెప్పాడు.