పదేళ్ల తర్వాత భలే మంచి ‘జి2’ ఛాన్స్

సోషల్ మీడియా, సినిమా సెలబ్రిటీలను బాగా ఫాలో అయ్యేవాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు వామికా గబ్బి. ఇటీవలే వరుణ్ ధావన్ బేబీ జాన్ లో సెకండ్ హీరోయిన్ గా తళుక్కున మెరిసింది తనే. ఇటీవలే ఇన్స్ టా రీల్ ఒకటి తెగ వైరల్ కావడం అందరి దృష్టిలో పడింది.

తాజాగా అడివి శేష్ గూఢచారి 2లో తనని కథానాయిక ఎంచుకోవడం తెలివైన ఛాయసని చెప్పొచ్చు. స్పై థ్రిల్లర్ అయినప్పటికీ శేష్ కథల్లో అమ్మాయిలకు పెర్ఫార్మన్స్ పరంగా తగిన ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ అతనికి ఇష్టమైన ఫ్రాంచైజ్ కాబట్టి కంటెంట్ ఓ రేంజ్ లో ఉంటుంది. పైన హెడ్డింగ్ లో పదేళ్ల పాయింట్ ఏంటో చూద్దాం.

వామికా గబ్బికి ఇది టాలీవుడ్ డెబ్యూ కాదు. 2015లో సుధీర్ బాబు భలే మంచి రోజుతో తెలుగు తెరంగేట్రం చేసింది. బొమ్మ భారీగా కాదు కానీ బాగానే ఆడినా తర్వాత మళ్ళీ కనిపించలేదు. హిందీ, పంజాబీకి అంకితమైపోయింది. మధ్యలో తమిళ డెబ్యూ కూడా అయిపోగొట్టింది.

గ్రహాన్, మాయి, జూబ్లీ లాంటి వెబ్ సిరీస్ లు మంచి పేరు తీసుకొచ్చాయి. కొన్ని మ్యూజిక్ వీడియోలు ఛార్ట్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు సరిగ్గా పదేళ్ల తర్వాత 2025లో తిరిగి తెలుగు నుంచి ఒక ఆఫర్ రావడమంటే విశేషమే. అది కూడా అడివి శేష్ సరసన అంటే మాములు బ్రేక్ కాదు. ఇవాళ అధికారికంగా ఈ న్యూస్ ప్రకటించారు.

జి2గా వ్యవహరిస్తున్న గూఢచారి 2ని ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. దీంతోపాటు డెకాయిట్ ని సమాంతరంగా చేస్తున్న అడవి శేష్ ముందు ఏది రిలీజవుతుందో చెప్పడం లేదు కానీ మృణాల్ ఠాకూర్ జంటగా చేస్తున్న డెకాయిట్ కే ఎక్కువ ఛాన్స్ ఉంది.

హిట్ 2 ది సెకండ్ కేస్ తర్వాత గ్యాప్ వచ్చినా సరే క్వాలిటీ కోసం తపిస్తున్న అడివి శేష్ సినిమాలు వేగంగా చేసేందుకు తొదరపడటం లేదు. ఇప్పటిదాకా తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో జి2 రూపొందుతోంది. వామికా గబ్బికి లక్కీ ఛాన్స్ అన్నది దీనికే. సినిమా హిట్టయ్యిందా ఇక్కడ తిరిగి అవకాశాలు పుంజుకుంటాయి.