వామ్మో.. సోనూ సూద్ ఇంత వయొలెంటా?

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎక్కువగా విలన్ వేషాలతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. కానీ కరోనా టైంలో తనలోని హ్యూమన్ యాంగిల్ చూసి అందరూ అతణ్ని ‘హీరో’ అన్నారు. లాక్ డౌన్ టైంలో కరోనా బాధితులకు అతను చేసిన సాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కడు లక్షల మందికి సాయపడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

తన మీద జనాల్లో వచ్చిన సాఫ్ట్ కార్నర్, హీరోయిక్ ఇమేజ్ వల్ల అతణ్ని ఆ తర్వాత విలన్ పాత్రల్లో చూడడానికి జనం అంతగా ఇష్టపడలేదు. నిజజీవితంలో సోనూ చేసిన మంచి పనుల వల్ల సినిమాల పరంగా అతడికి జరిగిన డ్యామేజ్ ఇది. ఈ నేపథ్యంలో అతను హీరోగా మారడం విశేషం. అంతే కాదు.. ఆ సినిమాకు తనే దర్శకుడు కూడా.

సోనూ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న ఆ చిత్రమే.. ఫతే. ఇంతకుముందే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ లాంచ్ అయింది. ఇప్పుడు రెండో ట్రైలర్ వదిలారు. అది చూసి జనాలకు దిమ్మదిరిగిపోతోంది. సోనూ సూద్ ఇంత వయొలెంటా అనిపించేలా.. ఈ సినిమాలో మామూలు వయొలెన్స్ దట్టించలేదు. యానిమల్, కిల్, మార్కో లాంటి చిత్రాలతో ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ రక్తసిక్తమైంది.

ఈ చిత్రాలు వయొలెన్సుని వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ కోవలోనే ‘ఫతే’లోనూ హింసను హద్దులు దాటించేశారు. కత్తులతో, గన్నులతో సోనూ సూద్ వీర విధ్వంసమే సృష్టించాడు. చంపడంలో అత్యంత హింసాత్మకమైన పద్ధతులు చూపిస్తూ చెలరేగిపోయాడు. ‘యానిమల్’, ‘కిల్’ సినిమాలను మించి.. ‘మార్కో’కు దీటుగా ఇందులో వయొలెన్స్ ఉన్నట్లే కనిపిస్తోంది.

ఐతే దర్శకుడిగా సోనూ ముద్ర కూడా ట్రైలర్లో బలంగానే కనిపించింది. సటిల్‌గా, డిఫరెంట్‌గా స్టోరీ నరేట్ చేసినట్లున్నాడు. మాజీ పోలీసాఫీసర్‌గా తన పాత్ర కూడా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. ఉద్యోగం వదిలేసి ప్రశాంతంగా బతుకుతున్న అతను.. సైబర్ క్రైమ్ సిండికేట్ చేతిలో పడ్డ ఓ అమ్మాయిని రక్షించడానికి చేసే పోరాటమే ఈ సినిమా. కొంచెం జేమ్స్ బాండ్ ఛాయలూ కనిపిస్తున్న ఈ చిత్రం.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో చెప్పుకోతగ్గ విశేషం ఏంటంటే ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు తో లాంచ్ చెపించడమే. తన స్నేహితుడైన సోను కోసం మహేష్ ఈ ట్రైలర్ ను ఆన్ లైన్ లో విడుదల చేసి ” అల్ ది బెస్ట్ మై డియర్ సోను ” అంటూ విష్ చేశారు. దీనికి బదులుగా ” లవ్ యు బ్రదర్, ఇద్దరం కలిసి సినిమా చూద్దాం ” అంటూ సోను రిప్లై ఇచ్చాడు.